కరోనా కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో జరగకపోవచ్చని అంచనా వేసారు. కానీ బిగ్ బాస్ యాజమాన్యం నాలుగవ సీజన్ టీజర్ ని రిలీజ్ చేసి పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే ప్రతీసారిలా కాకుండా ఈ ఏడాది బిగ్ బాస్ లో చాలా మార్పులు ఉండబోతున్నాయట. గత ఏడాది బిగ్ బాస్ సీజన్లో పదిహేడు మంది కంటెస్టేంట్లు హౌస్ లో కనిపించారు. ఈసారి కేవలం 13మందే హౌస్ లోకి వస్తారట.
ఇంకా గత రెండు సీజన్లు వంద రోజులకి పైగా సాగాయి. కానీ ఈసారి మాత్రం డెభ్భై రోజులు అంటే పదివారాలు మాత్రమే జరగనుందట. అయితే ఒక్కసారి కరోనా టెస్ట్ చేయించుకుని హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటి వాళ్ళని కలవడానికి అవకాశం లేదట. అందువల్లే నాలుగవ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అవకాశం లేదని సమాచారం.
అలాగే కామన్ మ్యాన్ హౌస్ లోకి రావడం అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టేసారట. మూడవ సీజన్లోనూ ఈ కామన్ మ్యాన్ ని పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సమాచారం ప్రకారం హౌస్ లోకి అడుగుపెడుతున్న వారిలో శ్రద్ధా దాస్, హంసా నందినీ, యామినీ భాస్కర్, సింగర్ మంగ్లీ, నోయల్ సేన్, కొరియోగ్రఫర్ రఘు మాస్టర్ పేర్లు వినబడుతున్నాయి. వీరిలో ఎంతమంది హౌస్ లోకి వస్తారో చూడాలి.