ఎవరైనా హీరోలు తండ్రి సినిమాల్లోనో, మావయ్యల సినిమాల్లోనో, తాతల సినిమాల్లోనో, అన్నయ్య, తమ్ముడి సినిమాల్లో అవకాశం వస్తే ఎగిరి గంతేసి సినిమా చేస్తారు. అలానే అక్కినేని హీరో సుమంత్ కూడా తన తాతయ్య నాగేశ్వర రావు, మావయ్య నాగార్జున సినిమాల్లో అవకాశాలు వస్తే ఎగిరి గంతేసి సినిమా చేసి చేతులు కాల్చుకుని.. పైగా ఇప్పుడు ఇన్నాళ్ళకి తాను చేసిన తప్పేమిటో చెబుతున్నాడు. మావయ్య నాగార్జునతో కలిసి ‘స్నేహమంటే ఇదేరా’ సినిమా చేసాడు సుమంత్. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా మలయాళంలో ఫ్రెండ్ పేరుతో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఆ సినిమా తమిళ్ లో రీమేక్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. కానీ తెలుగు రీమేక్ మాత్రం ప్లాప్ అయ్యింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఆ సినిమా పోతుంది అని తెలిసినా నోరు మెదపలేకపోయా అంటున్నాడు.
‘స్నేహమంటే ఇదేరా’ సినిమాలో నిజ జీవితంలో మామ అల్లుళ్లమైన మేమిద్దరం సినిమాలో స్నేహితులుగా నటించడాన్ని అభిమానులు, ప్రేక్షకులు అంగీకరించలేదన్నారు. అంతేకాదు తెలుగులో ఈ స్క్రిప్ట్ అంతగా గొప్పగా వర్కౌట్ కాలేదన్నారు. నాగార్జున మావయ్యకి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు చేసిన ఈ సినిమా నేను కాదనలేకపోయా అంటున్నాడు. అందుకే ఈ సినిమా చేయడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పుగా భావిస్తాను. ఇక తాత అక్కినేని నాగేశ్వరరావుతో చేసిన ‘పెళ్లి సంబంధం’ కూడా ప్లాప్ అయ్యింది. రాఘవేంద్రరావు బలవంతం చేయడంతో తాతయ్యతో నటించడానికి ఒప్పుకున్నా అని, మావయ్య, తాతతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఆత్రంతో నేను చేసిన సినిమాలు ఇవి. అసలు ఈ రెండు సినిమాలకు స్క్రిప్ట్ సరిగ్గా లేవు. అలాగే ఆ సినిమాల్లో మా అనుబంధాలు ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు అని చెబుతున్నాడు సుమంత్. అలా మావయ్య, తాతలతో చేసిన సినిమాలు తన జీవితంలో చేసిన పెద్ద తప్పులుగా భావిస్తున్నాడు సుమంత్.