వైజయంతీ మూవీస్ నిర్మించ తలపెట్టిన సైన్స్ ఫిక్షన్ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోనే హీరోయిన్‌గా ఎంపికయ్యేసరికి అగ్నికి వాయువు తోడయినట్లు అయ్యింది. కారణం.. టాలీవుడ్‌లో హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ప్రభాస్ కాగా, బాలీవుడ్‌లో హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ ఆర్టిస్ట్ దీపిక. కమర్షియల్ సినిమాల్లో నటించడానికి ఆమె తీసుకొనే పారితోషికం ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల దాకా ఉంటుందని చెప్పుకుంటారు.
అంతర్జాతీయ ఖ్యాతి తేవడమే కాకుండా పాన్ ఇండియా స్టార్‌గా నిలిపిన ‘బాహుబలి’ పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత 2019లో చేసిన ‘సాహో’ సినిమా నార్త్‌లో తప్ప ఇంకెక్కడా ఆడకపోవడంతో ‘రాధే శ్యామ్’ సినిమా మీద ప్రభాస్ చాలా శ్రద్ధ చూపిస్తున్నాడు. అంతలోనే నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసే తదుపరి సినిమాలో హీరోయిన్ గురించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ డబుల్ ఖుష్ అయ్యారు. అయితే కరోనా టైమ్స్‌లోనూ టాలీవుడ్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమాను తీయడానికి వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అసలు సిల్వర్ స్క్రీన్ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో, తెరుచుకున్నా జనం మునుపటిలా వాటికి తరలి వస్తారా.. అనేది ప్రశ్నార్థకమైన రోజులివి. అందుకు తగ్గట్లే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బాలీవుడ్ డైరెక్టర్, ‘మిస్టర్ ఇండియా’ ఫేమ్ శేఖర్ కపూర్ అంతటివాడు మరో సంవత్సరం దాకా థియేటర్లు తెరుచుకొనే అవకాశం లేదని తేల్చేశాడు. అంతే కాదు, ఇక స్టార్ సిస్టమ్ కూడా ముగిసినట్లేనని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్, దీపికకు కలిపే 75 కోట్ల నుంచి 100 కోట్ల దాకా రెమ్యూనరేషన్ సమర్పించుకొని, మరో 300 కోట్లు సినిమాపై పెట్టడం తెలివైన పనేనా? అనేది విశ్లేషకుల మాట.
ఫిల్మ్‌నగర్‌లోని జనాలైతే అసలు ఈ సినిమా సెట్స్ దాకా వస్తే అప్పుడు చూద్దాం అంటున్నారు. అంటే.. రాదని వాళ్ల ఉద్దేశం. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే భారీ హైప్ తీసుకొచ్చి, బయ్యర్ల నుంచి భారీ అడ్వాన్సులు తీసుకొని, ఆ అడ్వాన్సులతో షూటింగ్ నడపాలనేది నిర్మాతల ఆలోచన అనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే ప్రభాస్ జోడీగా దీపిక నటించనున్నదనే ప్రకటనకు విపరీతమైన ప్రచారం వచ్చేలా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యింది కూడా. వైజయంతీ మూవీస్ సంస్థ గతంలో మాదిరిగా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే పరిస్థితిలో లేదు. అడ్వాన్సుల రూపంలో డబ్బులు వచ్చే స్టార్స్‌తోనే అది బిగ్ సినిమాలు నిర్మించే పరిస్థితి ఉందనేది ఇండస్ట్రీ వర్గీయుల మాట.
వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకొనే సందర్భంలో వచ్చే సినిమాగా ప్రభాస్, దీపిక, నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీని నిర్మాతలు పేర్కొంటున్నారు. 2024 సంవత్సరానికి కానీ ఆ సంస్థకు 50 ఏళ్ల నిండవు. దాన్ని బట్టి ఈ సినిమా ఆ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అంటే ఇంకా కనీసం మూడున్నర సంవత్సరాలు గడవాలి! అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి ఎరుక?