తెలుగు నుండి బాలీవుడ్ కి రీమేక్ కి వెళ్లే సినిమాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మన సినిమాల కోసం అక్కడి నిర్మాతలు ఎగబడుతున్నారు. తెలుగు సినిమాల మీద బాలీవుడ్ జనాలకి ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా తెలుగు నిర్మాతలే బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు బాలీవుడ్ రీమేక్ సినిమాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. తాజాగా అల్లు అరవింద్ కూడా ఆ లిస్ట్ లో చేరాడట.
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరుంధతి సినిమా బాలీవుడ్ రీమేక్ హక్కులని అల్లు అరవింద్ కొనుక్కున్నాడని సమాచారం. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో అరుంధతి గా బాలీవుడ్ భామ దీపికా పదుకునే నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే ఈ విషయమై ఎలాంటి సమాచారం రానప్పటికీ దీపికా పేరు వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఆమె చేతిలో 83 సినిమాతో పాటు ప్రభాస్ సినిమా కూడా ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాతే అరుంధతి తెరకెక్కనుందట. అరుంధతి సినిమాలో విలన్ గా బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ హిందీలో కూడా విలన్ గా నటించనున్నాడట. అనుష్క కెరీర్లోనే గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిన అరుంధతి చిత్రం బాలీవుడ్ లో ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.