వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్ పూర్తిగా ఆర్ ఆర్ ఆర్ కే అంకితమయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కి ప్రేక్ష్గకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ కి ముందు అచార్య సినిమాలో ఒకానొక మంచి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఆర్ ఆర్ ఆర్ తర్వాతి సినిమా గురించి మాత్రం ఇంతవరకూ క్లారిటీ రాలేదు.
ఈ విషయమై ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి. మొన్నటికి మొన్న జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ప్రేమకథ చేస్తున్నాడని అన్నారు. అదీగాక కొత్త దర్శకుడితో చరణ్ చిత్రం ఉంటుందని కథనాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ లిస్టులోకి మరో దర్శకుడు వచ్చాడు. ఛలో సినిమాతో దర్శకుడిగా మారి డీసెంట్ హిట్ ని ఖాతాలో వేసుకుని, ఆ తర్వాత నితిన్ హీరోగా భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఆల్రెడీ వెంకీ కుడుముల కథ వినిపించాడని, దానికి చరణ్ ఓకే చెప్పాడని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యాక వెంకీతోనే సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందట. ఈ మేరకు ఇప్పటికైతే ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. చూడాలి మరి ఏం జరగనుందో..!