వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య ఎలాంటి సినిమాలు తీస్తున్నారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’ సినిమాల తర్వాత అభిమానులు ఆశించినంతగా చిత్రాలేమీ ఆర్జీవీ నుంచి రాలేదు. అప్పట్నుంచి ఆర్జీవీ పూర్తిగా మారిపోయి వివాదాస్పద కథలకే ప్రియారిటీ ఇస్తూ ఇప్పటికే నందమూరి ఫ్యామిలీని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో, మెగా ఫ్యామిలీని ‘పవర్ స్టార్’తో కెలికిన ఆర్జీవీ ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీనే టచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ ఆయన చేసిన కొన్ని వివాదాస్పద సినిమాలకు కొందరు వైసీపీ నేతలే కారణమని అపవాదు ఉంది. అయితే ఆ ముద్రను చెరిపేసుకోవడానికి వర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్లారిటీ..
ఇప్పటి వరకూ ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలపై విమర్శలు ఎక్కుపెట్టడంతో కొందరు అభిమానులు, నెటిజన్లు ఆయనకు కొన్ని సలహాలు, సూచనలు చేశారు. ఈ క్రమంలో కొందరు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ‘వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి’, ‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య’ పై సినిమాలు తీయాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించి టైటిల్స్‌ను కూడా సూచిస్తున్నారు. ‘బాత్రూమ్‌లో బాబాయ్’, ‘కోడి కత్తి’ అని టైటిల్ కూడా ఆర్జీవీకి నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి తాజాగా ఓ ప్రముఖ చానెల్‌లో నిర్వహించిన డిబెట్‌లో ఆయన పాల్గొని క్లారిటీ ఇచ్చారు.
భవిష్యత్తులో తీస్తా..
‘కోడి కత్తి’ అనేది చాలా చిన్నపాటి ఘటన అని.. దానిపై సినిమా తీయడానికి తాను సిద్ధంగా లేనన్నారు. అంతేకాదు ఆ ఘటనలో గ్రావిటీ అనేది లేనప్పుడు సినిమా తీయడం కష్టమని తేల్చేశారు. అంతటితో ఆగని ఆయన.. కోడి కత్తి అనేది ఎవరో ఏదో ప్లాన్ చేశారు.. అది వర్కవుట్ కాలేదంతే అంతకు మించి అందులో విషయం లేదని అందుకే తాను ఆ సబ్జెక్ట్‌ను టచ్ చేయనని ఆర్జీవీ తేల్చేశారు. ఇక ‘బాత్రూమ్‌లో బాబాయ్’పై స్పందించిన ఆర్జవీ.. ఈ ఘటనపై మిస్టరీ చాలా ఉందన్నారు. అసలు ఈ ఘటనకు పాల్పడిందెవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది..? దీనికి వెనుక ఆంతర్యం ఏంటి..? ఎన్నికలకు ముందు ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది..? అనేది ఒక డ్రామాలాగా ఉందని.. అందుకే ఇదొక వండర్‌ఫుల్ సబ్జెక్ట్ అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అందుకే ఈ ఘటనపై భవిష్యత్తులో సినిమా తీయొచ్చు అని ఆర్జీవీ స్పష్టం చేశారు.
వర్కవుట్ అయ్యేనా!?
కాగా.. ప్రస్తుతం ఆ హత్య ఘటనపై సీబీఐ రంగంలోకి దిగింది. నాలుగైదు రోజులుగా దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే వివేకా ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, పలువుర్ని విచారిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆర్జీవీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తానికి చూస్తే ఈసారి వివాదాస్పద ఘటనతో వైఎస్ జగన్ ఫ్యామిలీని ఆర్జీవీ టచ్ చేయబోతున్నారు. అయితే ఆర్జీవీ అనుకుంటే అధికారమా..? ప్రతిపక్షం అనేది ఎవర్నీ లెక్క చేయకుండా సినిమా తీసి తీరుతాడన్న విషయం విదితమే. మరి ఇది ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాలి.