ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ వలన సినిమా షూటింగ్స్ మొత్తం మూలనపడ్డాయి. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ హైదరాబాద్‌ని వదిలిపెట్టి దూరంగా ఉన్న ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోయాడు. ఇక పూరి జగన్నాధ్ కథలు రాసుకుంటున్నాడు. కొరటాల కూడా చిరు ఆచార్య సినిమా షూటింగ్ విషయమై.. దానికి సంబంధించిన సెట్స్ విషయమై ఆలోచించడమే కాదు.. సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ స్క్రిప్ట్‌తోనూ, సుకుమార్ పుష్ప షూటింగ్ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు కొరటాల శివ కరోనాని సీరియస్‌గా తీసుకోమంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాడు. రెండు రాష్ట్రాల సీఎంలు ముందు కరోనా గురించి భయపడినా.. ఇప్పుడు భయం పోయిందో.... లైట్ తీసుకున్నారో తెలియదు కానీ.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాని గాలికి వదిలేశాయి. దానితో ప్రజలంతా భయం లేకుండా రోడ్ల పైకి వచ్చేస్తున్నారు. కనీసం మాస్క్ లేకుండా, శానిటైజ్ చేసుకోకుండా ప్రజలంతా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
దానితో మండిన కొరటాల శివ.. నిర్లక్ష్యం వహించే ప్రజలకు ధీటైన ట్వీట్ వేసాడు. ‘‘ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం(ముక్కు, మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం..’’ అంటూ ఘాటైన ట్వీట్ వేసాడు. మరి మాస్క్ లేకుండానే యూత్ లో చాలామంది రోడ్డుపైన చక్కర్లు కొడుతున్నారు. పని ఉంటేనే రోడ్ పైకి రమ్మని చెబుతుంటే.. పనిలేని వాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. మరి ఒక్క కొరటాలకే కాదు.. అందరికీ సామాజిక స్పృహ ఉంటే.. మాస్క్ వేసుకోమని ఒకళ్ళు చెప్పేదాకా తెచ్చుకోవద్దు.