సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు, తన తర్వాతి సినిమాని పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ అక్టోబరులో మొదలు కానుందట. అయితే ప్రస్తుతం ఇంట్లోనే కాలం గడుపుతున్న మహేష్ బాబు, పిల్లలతో సరదాగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు.
సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్న మహేష్ బాబు, తనకి నచ్చిన సినిమాల గురించి, సిరీస్ ల గురించి ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నాడు. తనకి నచ్చిన సినిమా గురించి బయటకి చెప్పడంలో ఏమాత్రం వెనుకాడని మహేష్, తాజాగా తమిళ చిత్రమైన ఓ మై కడువలే చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. అశ్విన్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అశోక్ సెల్వన్ హీరోగా నటించాడు.
రితికా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మహేష్ కి చాలా నచ్చిందట. నటీనటుల పర్ ఫార్మెన్స్ తో పాటు రైటింగ్, దర్శకత్వం చాలా బాగున్నాయని, సినిమా ఆద్యంతం బాగా ఎంజాయ్ చేసానని ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు పొగడ్తల వర్షం కురిపించాడు. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అయితే ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవనుందని వార్తలు వస్తున్నాయి.