టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని పనికొచ్చే పనులకు వాడే వారికన్నా చెత్త పనులకు వాడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రముఖల పేర్లతో, సెలబ్రిటీల ఫొటోలతో అకౌంట్స్ ఓపెన్ చేసేయడం ఇష్టానుసారం ఎవర్నిపడితే వారిని తిట్టడం.. ప్రభుత్వాలను సైతం తిట్టిపోయడం ఇలా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై కొందరు దుండగులు టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీల పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి తిట్టిపోస్తున్నారు. ఆ మధ్య నటుడు రావు రమేష్ ‘ప్రజా వేదిక’ కూల్చివేత విషయంలో ప్రభుత్వాన్ని తిట్టినట్లు ఆయన పేరిట అకౌంట్‌లో ఉంది. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ నటుడిపై దుమ్మెత్తి పోశారు. తీరా చూస్తే అసలు ఆయనకు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్స్ లేవ్. అప్రమత్తమైన ఆయన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత మరో నటుడు ఫిష్ వెంకట్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ అకౌంట్‌ను క్రియేట్ చేసిన వ్యక్తి ఏకంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసునే కెలికి మరీ వివాదాస్పదంగా పోస్ట్‌లు పెట్టాడు. వెంకట్ కూడా పోలీసులను ఆశ్రయించడంతో కథ సుఖాంతం అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే నటీనటులు చాలా మందే బాధితులుగా ఉన్నారు.
అయితే తాజాగా.. ప్రముఖ కమెడియన్ అలీ కూడా ఫేక్ అకౌంట్ విషయమై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తన పేరిట ట్విట్టర్ అకౌంట్ చేసి 2017 నుంచి గుర్తు తెలియని వ్యక్తి దీన్ని నడుపుతూ ఎవరిమీద పడితే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం కొందరు అభిమానులు, ఆప్తులు అలీకి చెప్పడంతో ఆయన షాకయ్యారు. ఈ పోస్టులు తలనొప్పులు తెచ్చిపెట్టే విధంగా ఉండటంతో చేసేదేమీ లేక సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు అలీ. శనివారం నాడు సైబరాబాద్‌లోని క్రైమ్డిపార్టుమెంటు డిప్యూటీ కమిషనర్రోహిణి ప్రియదర్శినికి కమెడియన్ ఫిర్యాదు చేశారు. తనకు ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ అధికారికంగా లేదని.. ఈ ఖాతాను నడుపుతున్న వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అలీ కోరారు. కాగా.. అలీ పేరిట ఉన్న ఈ ట్విట్టర్ అకౌంట్‌కు సుమారు ఆరువేలకు మందికిపైగానే ఫాలోవర్స్ కూడా ఉండటం గమనార్హం. మొత్తానికి చూస్తే బాధితుల జాబితాలో అలీ కూడా చేరిపోయాడన్న మాట. అలీ ఫిర్యాదు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతారో.. ఇంతకీ ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తెవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.