కరోనా మహమ్మారి కారణంగా గత మూడు నెలల నుండి సినిమా థియేటర్లు మూతబడి ఉన్నాయి. ఇప్పటికీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. థియేటర్లు తెరుచుకోని కారణంగా నిర్మాతలు తమ సినిమాని ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారు. కరోనా వల్ల డిజిటల్ స్ట్రీమింగ్ కి బాగా డిమాండ్ ఏర్పడింది. వినోదం కోసం థియేటర్ కి వెళ్ళే అవకాశం లేకపోవడంతో జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు.
ఈ నేపథ్యంలో చాలా సినిమాలు డిజిటల్ లోకి వచ్చేస్తున్నాయి. బాలీవుడ్ లో అయితే ఈ జోరు బాగా కనిపిస్తోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ పదిహేడు సినిమాల స్ట్రీమింగ్ హక్కులని దక్కించుకున్నట్లు ప్రకటించింది. అయితే థియేటర్ కి ప్రత్యామ్నాయంగా ఓటీటీ తయారవుతున్న ప్రస్తుత సమయంలో ఒక చిన్న ఆశ నిర్మాతల్లో నమ్మకం కలిగిస్తుంది.
థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని వాదనలు వస్తున్న చైనాలో థియేటర్లు రీ ఓపెన్ అవుతున్నాయని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నుండి చైనాలో థియేటర్లు ఓపెన కానున్నాయట. కానీ చైనా అంతటా కాకుండా, కరోనా రిస్క్ ఎక్కడైతే తక్కువగా ఉందో అక్కడ థియేటర్లని ఓపెన్ చేయనున్నారట. దాంతో ఇండియాలోనూ మరికొద్ది రోజుల్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని ఆశలు పెట్టుకుంటున్నారు.