అగ్ర హీరో మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ నటించనున్నదనే వార్త అందరిలోనూ కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. కారణం.. ఇటీవల వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తోన్న ఆమె ఓ టాప్ స్టార్ సరసన చేయనుండటం ‘అజ్ఞాతవాసి’ తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం. మలయాళంలో పేరు తెచ్చుకుని నాలుగున్నరేళ్ల క్రితం రామ్ జోడీగా ‘నేను శైలజ’లో నటించడం ద్వారా కీర్తి టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలి చిత్రంలోనే తన ముగ్ధత్వంతో, తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండో సినిమాలో నాని జోడీగా ‘నేను లోకల్’ చేస్తే, అది కూడా పెద్ద హిట్.
మూడో సినిమాలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోడీగా నటించే ఛాన్స్ సంపాదించింది. అయితే ‘అజ్ఞాతవాసి’లో మరో నాయిక అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవడం వల్లా, అభినయాన్ని ప్రదర్శించడానికి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాకపోవడం వల్లా ఆ సినిమా ఆమెకు ఉపయోగపడలేదు. ఆ సినిమా చేసేటప్పుడే వచ్చింది.. ఊహించని అవకాశం.. మహానటి సావిత్రి పాత్ర పోషించే అవకాశం.. కానీ ఆ పాత్ర చేయడానికి మొదట భయపడింది కీర్తి. ఆమె పాత్రకు న్యాయం చెయ్యగలనా అనేది ఆమె సందేహం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇచ్చిన ధైర్యం, ఒకప్పటి హీరోయిన్ అయిన తల్లి మేనక ఇచ్చిన ప్రోత్సాహంతో ‘మహానటి’గా జీవించింది.
ఇక ఆ తర్వాతిదంతా ఒక చరిత్ర. ‘మహానటి’గా కీర్తి అపూర్వ అభినయానికి తెలుగు ప్రేక్షకులంతా దాసోహమయ్యారు. ‘‘సావిత్రి లాంటి అతి గొప్పనటి పాత్రను చెయ్యడం ఈ పిల్లకేం చేతనవును’’ అని తేలిగ్గా తీసిపారేసినవాళ్లు నోళ్లు మూతపడేలా అపూర్వ అభినయమే ప్రదర్శించింది కీర్తి. అందుకే ఆ ఏడాది జాతీయ ఉత్తమనటిగా ఆమెను ఏకగ్రీవంగా ఎంపికచేసిన అవార్డుల జ్యూరీ. జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా ఎంపికైనవాళ్ల కెరీర్ ఆ తర్వాత ఆశించిన రీతిలో సాగదనే పేరుంది. సాధారణంగా పెద్ద స్టార్లు ఆ తారలతో నటించడానికి అంతగా ఆసక్తి చూపరంటారు. పైగా అవార్డు నటిగా పేరుపొందిన వాళ్లకు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వస్తాయనే పేరుంది.
నిజానికి కీర్తి విషయంలోనూ అదే జరిగింది. వరుసపెట్టి లేడీ ఓరియంటెడ్ మూవీల ఆఫర్లు వచ్చాయి. ‘మిస్ ఇండియా’, ‘గుడ్‌లక్ సఖి’ సినిమాలు అలాంటివే. ఇటీవల ఓటీటీలో రిలీజైన ‘పెంగ్విన్’ కూడా అదే బాపతు. ఇక కీర్తి అలాంటి సినిమాలకే పరిమితమవుతుందా అని అందరూ అనుకుంటుంటే.. నితిన్ జోడీగా ‘రంగ్ దే’ సినిమా చేస్తూ.. ఆ అభిప్రాయానికి తెరదించింది. మరోవైపు తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తెగా ‘అన్నాత్తే’ మూవీ కూడా చేస్తోంది కీర్తి.
ఈ నేపథ్యంలో మహేష్‌తో సినిమా చేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పటి దాకా ఆమె ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్‌గా ఎంపికయ్యిందనే విషయం మీడియాకు తెలియలేదు. ఏదేమైనా సూపర్‌స్టార్ మహేష్ జోడీగా ఎంపికవడం అనేది ఆమెకు అందివచ్చిన ఓ మంచి అవకాశంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. టాలీవుడ్‌కు సంబంధించి నాలుగున్నరేళ్ల కెరీర్‌లో ఓ స్టార్ హీరోతో ఆమె నటించడం ఇది రెండోసారి మాత్రమే. మహేష్ ఆమెకు అవకాశం ఇవ్వడంతో మిగతా స్టార్ హీరోలు కూడా కీర్తి వైపు దృష్టి సారిస్తున్నారని వినిపిస్తోంది. ఇవాళ టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పూజా హెగ్డే.. లేదంటే రష్మికా మందన్న తప్ప వేరెవరూ స్టార్ హీరోల సినిమాల్లో కనిపించడం లేదు. ఇప్పుడు కీర్తి కూడా ఆ జాబితాలో చోటు సంపాదించడం దాదాపు ఖాయం.