మహానటి సావిత్రి జీవితకథని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించి ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ తన తర్వాతి చిత్రాన్ని బాహుబలి ప్రభాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి క్లాసిక్ చిత్రాలని తెరకెక్కించిన నాగ్ అశ్విన్, మాస్ హీరో అయిన ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో ఉంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందనుందని తెలిసిందే.
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ ఈ సినిమాని భారీ బడ్జెట్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. భారతీయ భాషల్లోనే కాకుండా ఇతర దేశాల భాషల్లోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే సైంటిఫిక్ ఫిక్షన్ గా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ విషయమై చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ నుండి మరికొద్ది రోజుల్లో సమాచారం రానుందట.
ఇప్పటికైతే ఇద్దరు హీరోయిన్ల పేర్లన్ని పరిశీలీస్తున్నారని టాక్. ఆ ఇద్దరూ బాలీవుడ్ భామలే కావడం విశేషం. దీపికా పదుకునే, కియారా అద్వానీ.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయనున్నారని అంటున్నారు. మరి దర్శకుడు నాగ్ అశ్విన్, ఆ ఇద్దరిలో ఎవరిని హీరోయిన్ గా ఎంచుకుంటాడో చూడాలి.