గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాలకి డిమాండ్ చాలా పెరిగింది. మన సినిమాలని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి నిర్మాతలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాతలు ఈ రేసులో ముందున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యి మంచి విజయాలని అందుకున్నాయి. ఇంకా రీమేక్ కావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో భాగమతి, ఆర్ ఎక్స్ 100, డీజే, అలవైకుంఠపురములో, జెర్సీ మొదలగు చిత్రాలు లిస్టులో ఉన్నాయి.
అయితే తాజాగా మరో రెండు చిత్రాలు కూడా ఈ జాబితాలో చేరాయి. అందులో ఒకటి ఫలక్ నుమా దాస్ సినిమాతో పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమా ఒకటి కాగా, ఎమ్ ఎమ్ కీరవాణీ తనయుడు సింహా తెరంగేట్రం చేసిన మత్తు వదలరా మరొకటి. మత్తు వదలారా చిత్రాన్ని నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అయితే నిజానికి ఈ సినిమా ప్లాన్ చేసినపుడే తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కించారని భావించారట. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని సమాచారం.
అయితే ప్రస్తుతం బాలీవుడ్ లోకి వెళ్లనున్న ఈ చిత్రానికి కూడా తెలుగు వెర్షన్ చిత్రానికి దర్శకత్వం వహించిన రితేష్ రానానే డైరెక్ట్ చేయనున్నాడట. కాకపోతే హిందీ వెర్షన్ కి మార్పులు చేయనున్నారట. ప్రస్తుతానికి డైరెక్టర్ ఆ పనుల్లో ఉన్నాడని, మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం రానుందట.