సినిమా స్టార్లంటే ప్రజల్లో ఉండే అభిమానమే వేరు. వాళ్లు మరో లోకం నుంచి వచ్చినవాళ్లుగా భావిస్తుంటారు. యువ అభిమానులైతే తమ అభిమాన హీరోల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. అమ్మాయిలైతే తమ కలల రాకుమారులను ఆరాధిస్తుంటారు. మనసులో ఆరాధించడమే కాదు, ఆ విషయాన్ని బాహాటంగా చెప్పుకోడానికీ ఈమధ్య చాలామంది అమ్మాయిలు వెనుకాడటం లేదు. ఆ హీరోని ప్రత్యక్షంగా కలవడానికి తహతహలాడే అమ్మాయిలు.. అతడిని కలవడం తటస్థిస్తే తమ పుస్తకాల్లోనే కాదు, చేతుల మీద, తమ ఒంటిమీద కూడా ఆటోగ్రాఫ్ తీసుకున్న సందర్భాలుంటున్నాయి. బ్యాచిలర్ అయిన హీరోతో తమ పెళ్లి కావడం అసంభవమని తెలిసినా కలలు కనడం మానరు. సదరు హీరోపై పిచ్చి ప్రేమను పెంచుకొనే అమ్మాయిలు, అతనికి పెళ్లి ఫిక్సయిందనే వార్త తెలిస్తే చాలు.. తెగ బాధపడిపోతుంటారు. తమ గుండెకు గాయమైనట్లే విలవిలలాడుతుంటారు.
ఇవాళ టాలీవుడ్‌లో యువ హీరోల సందడి ఎక్కువవడంతో అమ్మాయిల కలల రాకుమారులూ ఎక్కువయ్యారు. కొంతమంది హీరోలు ముప్పైలలోకి వచ్చినా పెళ్లిమాట తలపెట్టకపోవడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే నలభైలలోకి వచ్చినా ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నాడు. ఇండస్ట్రీ మొత్తమ్మీద అత్యంత క్రేజ్, ఇమేజ్ ఉన్న బ్యాచిలర్ స్టార్ అతనే. ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి 16 సంవత్సరాలు గడిచాయి. 2004లో ఈశ్వర్‌గా ఎంట్రీ ఇచ్చిన అతను ఇవాళ బాహుబలి, సాహో సినిమాలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కలల రాకుమారుడిగా రూపుదాల్చాడు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా చేసుకుంటాను అంటూ దాటవేస్తూ వస్తున్న అతను ప్రస్తుతం పూజా హెగ్డే జతగా ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు.
‘బాహుబలి’లో ప్రభాస్‌కు విలన్ అయిన రానా దగ్గుబాటి ఇటీవలే తన ప్రేయసి మిహికా బజాజ్‌తో ఏడడుగులు నడిచేందుకు నిర్ణయించుకున్నాడు. నితిన్ కూడా ఇప్పటికే తన సుదీర్ఘ కాల ప్రియురాలు శాలినితో ఎంగేజ్‌మెంట్ చేసుకొని, పెళ్లి ఘడియల కోసం నిరీక్షిస్తున్నాడు. ముప్పై ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి పీటలమీదకెక్కని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో సందీప్ కిషన్, ఆది పినిశెట్టి, అల్లు శిరీష్, నవదీప్, సాయిధరమ్ తేజ్ వంటి హీరోలున్నారు. 2014లో ‘ముకుంద’ సినిమాతో తెరపై తొలిసారి హీరోగా కనిపించిన వరుణ్ తేజ్ ‘కంచె’ చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలతో ఇటు ఫ్యామిలీ, అటు మాస్ ఆడియెన్స్‌లో ఇమేజ్ సంపాదించుకొని హాట్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందాడు.
మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసి పెళ్లిచూపులు సినిమాతో హీరో మెటీరియల్‌నని ప్రూవ్ చేసుకున్న విజయ్ దేవరకొండ.. సెన్సేషనల్ ఫిల్మ్ ‘అర్జున్‌రెడ్డి’తో యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. అతని ఫ్యాన్ బేస్‌లో అమ్మాయిల సంఖ్య తక్కువేమీ కాదు. 31 ఏళ్ల వయసున్నప్పటికీ వాళ్ల కలల రాకుమారుడు అతనే. ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ను ఆరాధించే వాళ్ల సంఖ్య మరీ పెరిగింది. పద్దెనిమిదేళ్లకే ‘దేవదాసు’ (2006)తో హీరోగా పరిచయమై చూపులకు చాక్లెట్ బాయ్‌లా కనిపించిన రామ్ ఇవాళ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మాస్ స్టార్‌గానూ రాణించగలనని నిరూపించుకున్నాడు. ఇప్పుడు అతనికి 32 ఏళ్లు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవచ్చనేది ఫిల్మ్‌నగర్ టాక్.
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో బాగా నలుగుతోన్న మరో బ్యాచిలర్ విష్వక్‌సేన్. ‘ఫలక్‌నుమా దాస్’తో వెలుగులోకి వచ్చిన అతను ‘హిట్’తో యూత్‌లో చెప్పుకోదగ్గ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడున్న క్రేజీ హీరోల్లో అందరికంటే చిన్నవాడు అతనే. పాతికేళ్ల విష్వక్ తన అగ్రెసివ్ నేచర్‌తోటే అమ్మాయిల హృదయాలను గెలుచుకుంటున్నాడు. మరికొంతమంది బ్యాచిలర్ హీరోలకూ అమ్మాయిల ఫాలోయింగ్ చెప్పుకోదగ్గ రీతిలోనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోల రాకతో ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పెరుగుతూ టాలీవుడ్‌కు కొత్త కళ తెస్తున్నారు.