టాలీవుడ్‌లోని ఇద్దరు యంగ్ టాప్ స్టార్స్ కలిసి నటిస్తున్నారంటే ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ఊహించుకోవాల్సిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటిస్తోన్న ఆ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్: రౌద్రం రణం రుధిరం’. ఇందులో రౌద్రంకు ప్రతీకగా అల్లూరి సీతారామరాజు కనిపించనున్నాడు. ఆ పాత్రను చరణ్ పోషిస్తున్నాడు. ఇక్కడ రౌద్రంను అగ్ని (ఫైర్)గా డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్నాడు. చరణ్‌లోని ఫైర్‌కు తగ్గట్లే ఆ పాత్రను అతనికి రాజమౌళి ఇచ్చినట్లు ఊహించుకోవచ్చు. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరిట మూడు నెలల క్రితం రిలీజ్ చేసిన రామరాజు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్ సృష్టించిన హంగామా ఎలాంటిదో మనం ప్రత్యక్షంగా చూశాం. దానికి యూట్యూబ్‌లో 18 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి.
టాలీవుడ్‌లోనే కాకుండా దేశంలోనే నెంబర్‌వన్ డైరెక్టర్‌గా అందరూ అంగీకరిస్తోన్న రాజమౌళి తనదైన శైలిలో చరణ్‌ను రామరాజుగా మలుస్తున్నాడు. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల తర్వాత ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇలాంటి అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంలో చరణ్ సరసన నటిస్తోన్న తారపై అందరి దృష్టీ ప్రసరించడం సహజమే. పైగా ఆ తార అలాంటి ఇలాంటి తార కాదాయె! బాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోయిన్ రేసులో ముందున్న తార అలియా భట్ అయ్యే!! ఎప్పట్నుంచో రాజమౌళి సినిమాలో నటించాలనే కోరికతో ఉన్న ఆమె, ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో రాజమౌళి కనిపించగానే, తన కోరికను వెల్లడి చేసేసింది. అవకాశం ఉంటే తప్పకుండా చూస్తానని చెప్పిన జక్కన్న.. రామరాజుకు మనసును అర్పించిన సీత పాత్రకు ఆమెనే ఎంచుకొని కబురందించాడు. ఇంకేముంది.. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా సరే అనేసింది అలియా.
నిజానికి ఆమె డైరీలో ఖాళీ లేదు. ‘సడక్ 2’, ‘బ్రహ్మాస్త్ర’, ‘గంగూబాయ్ కథైవాడి’ సినిమాల కోసం డేట్స్ కేటాయించేసింది. కానీ రాజమౌళి కోసం ఆ డేట్స్‌ను సర్దుబాటు చేసుకొని మరీ డేట్స్ ఇచ్చింది. డైరెక్టర్ మహేశ్ భట్, నటి సోనీ రజ్దాన్ కుమార్తె అయిన అలియా ఎనిమిదేళ్ల క్రితం కరణ్ జోహార్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన క్యూట్ ఫేస్‌తో, ముచ్చటైన అభినయంతో యువతరం నయా కలలరాణిగా అవతరించింది. అప్పట్నుంచీ ఒకదానికొకటి సంబంధంలేని స్క్రిప్టులు, పాత్రలతో అటు విమర్శకులనూ, ఇటు ప్రేక్షకులనూ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అందుకు ఉదాహరణ.. హైవే, 2 స్టేట్స్, హంప్టీ శర్మా కీ దుల్హనియా, ఉడ్‌తా పంజాబ్, డియర్ జిందగీ, రాజీ, గల్లీ బాయ్, కళంక్ సినిమాలు.
తెరపై చరణ్, అలియా జోడీ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులంతా కుతూహల పడుతున్నారు. జోడీ బాగుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ మరింతగా ప్రేక్షకుల్ని అలరించడం ఖాయం. కరోనా గొడవ లేనట్లయితే ఈ సరికి షూటింగ్ ముగింపుకు వచ్చేసి ఉండేది. అప్పుడు ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 8న సినిమా విడుదలకు రంగం సిద్ధమయ్యేది. ఇప్పుడా పరిస్థితి లేదనేది అందరికీ తెలిసిందే. ఏదేమైనా ఈ ఏడాది చివరి నాటికి ఎలాగైనా చిత్రీకరణ పూర్తిచెయ్యాలని రాజమౌళి, దానయ్య దృఢ సంకల్పంతో ఉన్నారు. అది గనుక జరిగితే, 2021 సమ్మర్ గిఫ్ట్‌గా ‘ఆర్ ఆర్ ఆర్’ ఆడియెన్స్ ముందుకు రావడం ఖాయమే. చూద్దాం.. సీత-రామరాజు జోడీ తెరమీద ఎలా కనిపిస్తుందో!?