చాలా మంది చిన్న స్టార్స్ సినిమా షూటింగ్స్ కి సమాయత్తమవుతుంటే.. స్టార్ హీరోలెవరూ సినిమా షూటింగ్స్ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కారణం కరోనా. కరోనా ఉదృతి రోజు రోజుకి పెరిగిపోవడంతో స్టార్ హీరోలెవరు షూటింగ్స్ కి వెళ్లే ధైర్యం చెయ్యడం లేదు. కారణం యంగ్ హీరోలు తప్ప స్టార్ హీరోలంతా 40 ఏళ్ళకి దగ్గరవుతున్నవాళ్ళే. అందుకే వాళ్ళు కరోనా టైం లో షూటింగ్ చెయ్యడం అంత మంచిది కాదని ఫిక్స్ అయ్యారు. కాబట్టే షూటింగ్స్ కి వెళ్లడం లేట్ అవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా స్టార్ హీరోల మానసిక స్థితి ఎలా ఉంది అంటే.. కరోనా టీకా వచ్చేవరకు షూటింగ్స్ చేయకపోవడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
హైదరాబాద్ లోనే షూటింగ్స్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి.. సెట్స్ నిర్మాణం కూడా చేపట్టాక హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే కరోనా తీవ్రత ఎక్కువగా పెరగడంతో.. ఇలాంటి సమయంలో షూటింగ్ చేసి రిస్క్ చెయ్యడం అవసరమా అని భావిస్తున్నారట హీరోలు. అందుకే కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు షూటింగ్ చేయకపోవడమే మంచిది అని భావిస్తున్నారట ప్రస్తుతం ఎక్కడ షూటింగ్ చేసుకుందామన్నా కరోనా కోరల్లో చిక్కుకోవడమే అని హీరోల భావనట. అందుకే ఎక్కడివాళ్ళు అక్కడ గప్ చిప్ అంటున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు షూటింగ్ చెయ్యకపోతే నిర్మాతలపై పెనుభారం పడే అవకాశం ఉంది. కాకపోతే డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు.. ప్రాణాలు పోయాక డబ్బు ఏం చేసుకుంటామని, బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు అనే తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలను స్టార్ హీరోలు గుర్తు చేసుకుంటున్నారట.