ప్రతి ఏటా సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే మూడు నాలుగు సినిమాల్లో ఏది విజేతగా నిలుస్తుందనేది అందరిలోనూ ఆసక్తిని కలిగించే అంశం. 2019 సంక్రాంతి సీజన్‌లో ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో ‘ఎఫ్2’ మూవీ విడుదలైనప్పుడు సహజంగా ఎవరైనా ఏ సినిమా విజేతగా నిలుస్తుందని ఊహిస్తారు? ఒకటేమో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ బయోపిక్, మరొకటి బోయపాటి శ్రీను వంటి మాస్ డైరెక్టర్‌తో తొలిసారి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ చేసిన చిత్రం.. ఈ రెండింటిలో ఒకటి బ్లాక్‌బస్టర్ అవుతుందనీ లేదూ రెండు అవుతాయనీ ఎవరైనా ఊహిస్తారు. ఊహాతీతంగా ఆ రెండు సినిమాలనీ బాక్సాఫీస్ దగ్గర చిత్తుచేసి అనిల్ రావిపూడి అనే కుర్ర డైరెక్టర్ తీసిన ‘ఎఫ్2’ సినిమా విజయబావుటా ఎగరేసింది. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన ఆ సినిమా వాళ్ల కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
అదే ఏడాది చివర డిసెంబర్‌లో అదే వెంకటేశ్, తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన ‘వెంకీమామ’ ఊహలకు భిన్నంగా ఆశించిన మేర వసూళ్లు సాధించలేకపోయింది. వెంకీ, చైతూ కలిసి నటించిన సినిమా కావడంతో విడుదలకు ముందు ఎంతో హంగామా చేసినా, విడుదల తర్వాత ఆ మేరకు సత్తా చూపలేకపోయింది. డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) కథలో, కథనంలో వేసిన తప్పటడుగులు, క్లైమాక్స్‌ను చిత్రీకరించిన తీరు ఆడియెన్స్‌ను నిరుత్సాహపరిచాయి. మేనమామ-మేనల్లుడి సెంటిమెంట్ కూడా అంచనాలకు తగ్గట్లు వర్కవుట్ కాలేదు.
వెంకటేశ్ ఇప్పుడు ‘నారప్ప’ మూవీ చేస్తున్నారు. అది.. తమిళంలో ధనుష్ నటించగా ఘనవిజయం సాధించిన ‘అసురన్’కు రీమేక్. యంగ్ స్టార్ అయిన ధనుష్ ఇద్దరు కొడుకుల తండ్రిగా, మధ్యవయస్కుడి పాత్రను చేయడం నిజంగా ఒక సాహసం. అది దుస్సాహసం కాకుండా విజయం సాధించడంలో ధనుష్ నటనా సామర్థ్యం ఎంతగా పనికొచ్చిందో, డైరెక్టర్ వెట్రిమారన్ స్క్రీన్‌ప్లే, టేకింగ్ అంతగానూ ఉపకరించింది. అందుకే ‘అసురన్’ బాక్సాఫీస్ దగ్గర అనూహ్యమైన విజయం సాధించాడు. 36 సంవత్సరాల ధనుష్ చేసిన ఆ పాత్రను తెలుగులో 59 సంవత్సరాల వెంకటేశ్ చేస్తున్నారు. నిజానికి ఇది ఆయన వయసుకు సరిగ్గా సరిపోయే పాత్రే. ‘నారప్ప’ అనే టైటిల్ ఆకర్షణీయంగానూ ఉంది. ఆ టైటిల్ రోల్‌లో వెంకటేశ్ లుక్ అమితంగా ఆకట్టుకుంటోంది. నాణేనికి ఇదొక పార్శ్వం.
రెండో పార్శ్వమేమంటే.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం. ప్రస్తుతం అతను కెరీర్ పరంగా లోస్టేజ్‌లో ఉన్నాడు. ‘బ్రహ్మోత్సవం’ వంటి అతుకుల బొంత కథను తీసి, నవ్వులపాలైన అతనికి తనను తాను ప్రూవ్ చేసుకొనే సువర్ణావకాశం ‘నారప్ప’ రూపంలో లభించింది. సురేశ్‌బాబు, వెంకటేశ్ ఈ సినిమాకు దర్శకుడిగా శ్రీకాంత్‌ను ఎంచుకోవడం ఇండస్ట్రీ వర్గాల వారినే కాకుండా, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందనేది నిజం. వాళ్లు అతడిలోని దర్శకుడిని నమ్మారని అర్థం చేసుకోవచ్చు. వెట్రిమారన్ లాంటి మేధోసంపత్తి ఉన్న దర్శకుడు తీసిన సినిమాని, దాని ఆత్మ చెడకుండా తెలుగు నేటివిటీకి అనుగుణంగా రూపొందించడం ఆషామాషీ విషయం కాదు. ఆ బాధ్యతను శ్రీకాంత్ అడ్డాల పట్టుదలతో స్వీకరించాడు. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ‘నారప్ప’ను అతను ఆకర్షణీయంగానూ, ఆసక్తికరంగానూ తీస్తున్నాడు. వెంకటేశ్ భార్య పాత్రకు ప్రియమణిని ఎంచుకోవడంలోనూ, పెద్ద కొడుకు పాత్రకు ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నంను తీసుకోవడంలోనూ శ్రీకాంత్ క్యాస్టింగ్ సామర్థ్యం తెలుస్తోంది.
మునుపటి అసాధారణ చేదు అనుభవాన్ని మర్చిపోవడం అంత తేలికకాకపోయినా ‘నారప్ప’ను బాక్సాఫీస్ బరిలో అందలం ఎక్కించగలిగితే, అతడి విమర్శకుల నోళ్లు మూతపడే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని శ్రీకాంత్ అడ్డాల సమర్థవంతంగా వినియోగించుకుంటాడా? ఇదే అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోన్న అంశం.