కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏడాదికి ఒక్క సినిమాని రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. అయితే సినిమాలతో పాటు ప్రతీ ఏడాది బిగ్ బాస్ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించే సల్మాన్ ఖాన్, బిగ్ బాస్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. ఇప్పటి వరకూ పదమూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో పద్నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానుంది. అయితే మొదటి సీజన్ నుండి ఇప్పటి వరకూ సల్మాన్ ఖానే వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
గత ఏడాది పదమూడవ సీజన్ కి ఒక్కో ఎపిసోడ్ కి 14కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సల్మాన్ ఖాన్ ఈ సారి రెండు కోట్లు పెంచి 16కోట్లు అడుగుతున్నాడట. ఒక్కో ఎపిసోడ్ కి 16కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అయితే దానికి కారణం కూడా ఉందని అంటున్నారు. గత ఏడాది కంటే ఈ సారి బిగ్ బాస్ సీజన్ మరిన్ని ఎక్కువరోజులు ఉండనుందట. అందువల్ల సల్మాన్ ఖాన్ తన రెమ్యునరేషన్ ని కూడా పెంచాడని అంటున్నారు.
అయితే సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో సల్మాన్ అడిగినంత ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం రెడీగా ఉందని అంటున్నారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం బిగ్ బాస్ షో మొదలవుతుందో లేదోనన్న సందేహం చాలామందిలో కలిగింది. కానీ ప్రభుత్వం షూటింగులకి అనుమతులు ఇచ్చిన కారణంగా అన్ని జాగ్రత్తలతో మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవనుంది.