Advertisementt

ఎస్. ఎస్. రాజమౌళి.. ద బాస్‌!

Thu 09th Jul 2020 12:32 PM
rrr,ss rajamouli,the boss,baahubali,world wife craze,director rajamouli  ఎస్. ఎస్. రాజమౌళి.. ద బాస్‌!
Director SS Rajamouli The Boss ఎస్. ఎస్. రాజమౌళి.. ద బాస్‌!
Advertisement
Ads by CJ

ప్ర‌భాస్‌తో య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి ‘బాహుబ‌లి: ద క‌న్‌క్లూజ‌న్‌’ను రూపొందించిన‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా అమిత‌మైన ఆస‌క్తి నెల‌కొంది. ‘బాహుబ‌లి: ద బిగినింగ్’ మూవీ సాధించిన గొప్ప విజ‌యాన్ని ఈ రెండో సినిమాతో రాజ‌మౌళి సాధిస్తాడా?.. అనే ఉత్కంఠ నెల‌కొంది. పైగా బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌నే ప్ర‌శ్న విప‌రీత‌మైన హైప్‌ను తీసుకొచ్చిందాయె. అదే.. ‘బాహుబ‌లి 2’కు ప్ల‌స్ పాయింట్‌గా మారి స‌రికొత్త రికార్డులు సృష్టించ‌డానికి కార‌ణ‌మైంది. ఇప్ప‌టికీ దేశంలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన రికార్డు ఆ సినిమా పేరిట ప‌దిలంగానే ఉంది. దేశం మొత్త‌మ్మీద మీడియాలో, సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన ప్ర‌చారం వ‌ల్లే ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆ సినిమాకు అనూహ్య‌మైన వ‌సూళ్లు సాధ్య‌మ‌య్యాయి.

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విష‌యంలో జ‌రుగుతున్న‌ది కూడా అదే. అయితే ఒక ప్రాంతీయ భాషా ద‌ర్శ‌కుడు ఈ స్థాయిలో ప్ర‌చారాన్ని పొంద‌డం భార‌త సినీ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మ‌మ‌ని విశ్లేష‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. గ‌తంలో త‌మిళ ద‌ర్శ‌కులు మ‌ణిర‌త్నం, శంక‌ర్‌ల‌కు వ‌చ్చిన ప్ర‌చారంతో పోలిస్తే రాజ‌మౌళి క్రేజ్ ఎన్నో రెట్లు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. జాతీయ స్థాయి వార్తా ప‌త్రిక‌లు, టీవీ చాన‌ళ్లు రాజ‌మౌళికి బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల‌కు మించి ప్ర‌చారాన్ని ఇస్తుండ‌టం మాత్రం నిస్సంశ‌యంగా విస్మ‌యానికి గురిచేసే అంశ‌మే. ఎందుకు క‌ట్ట‌గ‌ట్టుకున్న‌ట్లు మీడియా రాజ‌మౌళికీ, ఆర్ఆర్ఆర్ మూవీకి అంత ప్రాధాన్య‌త‌నీ, ప్ర‌చారాన్నీ ఇస్తున్న‌ట్లు? టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఇద్ద‌రు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తుండ‌టం, అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఒక కీల‌క పాత్ర చేస్తుండ‌టం, అలియా భ‌ట్ హీరోయిన్‌గా చేస్తుండ‌టం, దేశం మొత్తంలోనే అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టం ‘ఆర్ఆర్ఆర్’ హైప్‌కు ప్ర‌ధాన కార‌ణం.

చిత్ర‌మేమంటే గ‌తేడాది మార్చిలో ఈ సినిమా గురించి జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో రాజ‌మౌళి, ఆయ‌న హీరోలు మాట్లాడారు. అప్ప‌టికి సినిమా షూటింగ్ మొద‌లే కాలేదు. ఆ త‌ర్వాత యాక్ట‌ర్ల గురించిన అప్‌డేట్ మిన‌హా ఈ సినిమా గురించి ఇంకెవ‌రూ మాట్లాడ‌లేదు. రాజ‌మౌళి సినిమా మేకింగ్ గురించి ఎంత గోప్య‌త పాటిస్తూ వ‌స్తుంటే, ఆన్‌లైన్‌లో అంత‌గా ఆ సినిమా ప్ర‌చారం పొందుతూ వ‌స్తోంది. క‌రోనా కాలంలోనూ రాజ‌మౌళి గురించీ, ఆయ‌న సినిమా గురించీ ప్ర‌చారం ఆగ‌ట్లేదు. మొద‌ట 2020 జూలై 30న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని సంక‌ల్పించామ‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించాడు. త‌ర్వాత 2021 జ‌న‌వ‌రి 8కి విడుద‌ల‌ను వాయిదా వేశామ‌న్నారు. ఇప్పుడు ఆ తేదీకీ ‘ఆర్ఆర్ఆర్’ వ‌చ్చే అవ‌కాశం లేదు. స‌మ్మ‌ర్‌కైనా వ‌స్తుందా.. అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏదేమైనా రాజ‌మౌళి స‌మ్మోహ‌న శ‌క్తి ఏ స్థాయిలో ఉందో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మ‌రోసారి చాటి చెపుతోంది. దేశ‌వ్యాప్తంగా.. ఆ మాట‌కొస్తే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా కోసం జ‌నం ఎదురు చూస్తున్నారు. ‘బాహుబ‌లి’తో ప్ర‌భాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్‌’తో తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌ను పాన్ ఇండియా స్టార్స్‌గా మార్చేస్తాడ‌ని ఆ హీరోల ఫ్యాన్స్ బ‌లంగా న‌మ్ముతున్నారు. ‘సాహో’ సినిమాతో నార్త్ ఇండియాలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్ర‌భాస్ క్రేజ్ ఎలా ఉందో తెలిసొచ్చిన‌ట్లే.. ‘ఆర్ఆర్ఆర్‌’తో రాజ‌మౌళి క్రేజ్ తెలుస్తుంద‌నీ, ఈ మూవీతో తార‌క్‌, చ‌ర‌ణ్ ఇమేజ్ ఇప్పుడున్న దానితో పోలిస్తే ఎన్నో రెట్లు పెరుగుతుంద‌నీ, ఆ త‌ర్వాత వాళ్లు చేసే సినిమాల‌కు మార్కెట్ అనూహ్య స్థాయిలో ఉంటుంద‌నీ ట్రేడ్ అన‌లిస్టులు అంచ‌నా వేస్తున్నారు.

అమిత‌మైన ప్ర‌చారంతో విడుద‌ల‌య్యే సినిమాపై ఆడియెన్స్ అంచ‌నాలు కూడా అదే తీరులో ఉండ‌టం స‌హ‌జం. గ‌తంలో చాలా సినిమాల‌కు ఇదే అంశం ప్ర‌తికూలంగా మారి, వాటి బాక్సాఫీస్ ఫ‌లితాన్ని నిర్దేశించింది. రాజ‌మౌళి సినిమా అంటే ఆ అంచ‌నాలు మ‌రీ ఎక్కువ‌. ప్ర‌తిసారీ అంచ‌నాల‌ను అందుకోవ‌డం, అందులోనూ రెట్టింపు స్థాయిలో అందుకోవ‌డం అల‌వాటుగా మార్చుకున్న రాజ‌మౌళి.. ‘ఆర్ఆర్ఆర్‌’తో మ‌రోసారి ‘ద బాస్‌’గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటాడ‌ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ అంతా న‌మ్ముతోంది. అందులో వింతేముంది?!

Director SS Rajamouli The Boss :

World Waiting for Rajamouli RRR Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ