బాలీవుడ్ సినిమాలకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసి, శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్ గా మారిన సీరత్ కపూర్, ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉందట. అయితే దానికి కారణం ఆమె నటించిన తెలుగు చిత్రం క్రిష్ణ అండ్ హిస్ లీల కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడమే. డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందించారు. ఈ సినిమాలో సీరత్ కపూర్ రుక్సార్ అనే పాత్రలో కనిపించింది.
అయితే రన్ రాజా రన్ తర్వాత సీరత్ కపూర్ చాలా సినిమాలే చేసినప్పటికీ ఏదీ సరైన గుర్తింపు తీసుకురాలేదు. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రంలో ఆమె పాత్రకి గుర్తింపు దక్కింది. ఇద్దరు అమ్మాయిలని ఒకేసారి ప్రేమిస్తూ ఒకరకమైన కన్ఫ్యూజన్ లో ఉండే అబ్బాయి స్నేహితురాలిగా రుక్సార్ పాత్రలో సీరత్ కపూర్ చాలా చక్కగా నటించింది. అయితే ప్రస్తుతం సీరత్ కపూర్ కొత్త చిత్రం రిలీజ్ కి రెడీ కాబోతుందని సమాచారం.
మా వింతగాధ వినుమా అనే విభిన్నమైన టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఆమె తమిళ అమ్మాయిగా కనిపించనుందట. ఈ సినిమా తన కెరీర్లో మంచి చిత్రంగా నిలవనుందని అంటోంది. మరి సినిమా రిలీజ్ అయితేగానీ విషయం ఏంటనేది ఎవ్వరికీ తెలీదు.