అన్ని రంగాలలో మార్కెట్ అనూహ్యంగా మారుతున్నట్లే ఇమేజ్, ఫ్యాన్స్ అనే భ్రమల్లో గిరిగీసుకొని తిరుగుతూ వచ్చిన తెలుగు చిత్రసీమ కూడా మారుతోంది. ప్రస్తుత తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఎన్నో ‘సీన్లు’ కనిపిస్తున్నాయి. మల్టీస్టారర్ మూవీస్‌కు సరైన కథ లభిస్తే చేసేందుకు సిద్ధమేనని గతంలో మాటల వరకే ఉండే స్టార్లు ఇవాళ నిజంగా చేతల్లో చూపిస్తున్నారు. కొంత కాలం క్రితం మార్కెట్ లేని ఓ నలుగురు బి గ్రేడ్ హీరోలు కలిసి నటిస్తే దాన్నే మల్టీస్టారర్ అని సరిపెట్టుకొనేవాళ్లం. కానీ ఎప్పుడైతే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రాన్ని పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో వెంకటేష్, మహేష్ కలిసి చేశారో.. అప్పట్నుంచీ నిజమైన మల్టీస్టారర్ సినిమాలు రావడం టాలీవుడ్‌లో పునఃప్రారంభమైంది. ఈవాళ ఆడియెన్స్‌లో సమాన ఇమేజ్ ఉన్న ఇద్దరు సమకాలీన స్టార్లు.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి యస్.యస్. రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు.
స్టార్ హీరోలే కాకుండా మరికొంత మంది యువహీరోలు సైతం సోలోగా సినిమాను హిట్ చేసే సత్తా తమకుందని నిరూపించుకుంటున్నారు. గతేడాది నుంచి చూసుకుంటే మాస్ స్టార్లు కాని హీరోలు నటించిన ఇస్మార్ట్ శంకర్, మజిలీ, జెర్సీ, గద్దలకొండ గణేష్, 118, చిత్రలహరి, ఫలక్‌నుమా దాస్, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, రాక్షసుడు, ఎవరు, ప్రతిరోజూ పండగే, భీష్మ, హిట్ వంటి సినిమాలు హిట్టయ్యాయి. ఈ సినిమాలను గమనిస్తే యువహీరోల మైండ్‌సెట్ మారిందని అర్థమవుతుంది. వీళ్లంతా మూస కథలను కాకుండా కొత్తదనం ఉన్న కథలు, స్క్రీన్‌ప్లేలను ఎంచుకుంటున్నారు. నాగచైతన్య, నాని, వరుణ్‌తేజ్, అడివి శేష్, శ్రీవిష్ణు, విష్వక్‌సేన్ వంటి హీరోలు చక్కని స్క్రిప్టులతో వస్తున్న దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
నేటి హీరోలు ఫాల్స్ ఇమేజ్ జోలికి వెళ్లకుండా ఓపెన్‌గా ఆలోచిస్తుండటం వల్ల తెలుగు సినిమా తీరుతెన్నులు మారుతున్నాయనే విషయం అవగతమవుతుంది. ఇలా ఆలోచిస్తుండటం వల్లే మనకంటే ముందు బాలీవుడ్ చక్కని విజయాలు అందుకుంటూ వచ్చింది. మారుతున్న మార్కెట్ వ్యూహాన్ని అందిపుచ్చుకున్న బాలీవుడ్‌ను చూసి టాలీవుడ్ సైతం త్వరగా దాన్ని ఒంటపట్టించుకుంది. సరికొత్త కథల్లో హీరోలు కాస్తా నటులుగా మారి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ఉదాహరణకు ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాల్లో సాయిధరమ్ తేజ్ పాత్రలు హీరోయిజంతో విర్రవీగక, మన పక్కింటబ్బాయి తరహా క్యారెక్టరైజేషన్‌తో ఆకట్టుకున్నాయి.
వరుణ్‌తేజ్ ఓ వైపు సోలో హీరోగా నటిస్తూనే, మరోవైపు తోటి హీరోలతో కలిసి, భిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. తను హీరోగా ఎదుగుతున్న రోజుల్లోనే ‘గద్దలకొండ గణేష్’లో విలన్‌గా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ‘ఎఫ్2’లో కామెడీ చేశాడు. ఇప్పుడు బాక్సర్‌గా కనిపించడానికి శ్రమిస్తున్నాడు. వరుణ్ లాగే ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు సోకాల్డ్ ఇమేజ్‌లను పక్కనపెట్టి డిఫరెంట్ రోల్స్‌లో డీసెంట్‌గా నటిస్తున్నారు. ఇవాళ నూనూగు మీసాల కుర్ర హీరో తన కన్నా ఎన్నో రెట్లు బలిష్ఠుడైన విలన్‌ను ఒంటిచేత్తో కొట్టడం లేదు. మెగాస్టార్ లాగా తొడగొట్టి ఛాలెంజ్‌లు చెయ్యడం లేదు. అందుకే మూసకథలు మూలన పడుతున్నాయి. సరికొత్త కథ, కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, ఎవరు, బ్రోచేవారెవరురా, జెర్సీ వంటి న్యూ ఏజ్ సినిమాలు వస్తున్నాయి.
హీరోల ప్రోత్సాహంతో కొత్త దర్శకులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఇవాళ హీరోలు పేరున్న బ్యానర్, పేరున్న డైరెక్టర్ కోసం చూడట్లేదు. సరికొత్త పాత్రలను తమ వద్దకు తీసుకొస్తున్న కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ప్రొఫెషనలిజం అంటే పోటీపడకపోవడం కాదనీ, పోటీపడుతూనే కొత్త మార్కెట్‌ను సృష్టించుకొని లాభపడటమనీ వాళ్లు గ్రహిస్తున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలో ఆడియెన్స్ అభిరుచులు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయి. మూసను వారు నిరాకరిస్తున్నారు. ఆ విషయం గ్రహించని హీరోలే రంగస్థలం నుంచి నిష్క్రమిస్తున్నారు. టాప్ స్టార్లను అనుకరించాలని చూస్తూ బొక్కబోర్లా పడుతున్నారు. ఆలోచనలను మార్చుకొని అడుగు ముందుకేస్తున్న నేటితరం హీరోలు కాలప్రవాహంలో కొట్టుకుపోకుండా తమదైన ముద్ర వేస్తున్నారు.