కరోనా వైరస్ సృష్టిస్తున్న రసాభాస కారణంగా థియేటర్లో సినిమాని ఇప్పుడప్పుడే ఊహించలేం. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులని చూస్తుంటే ఆందోళనతో పాటు భయం కూడా ఎక్కువవుతుంది. ప్రభుత్వం అన్ లాక్ దశలో ఉన్నామని చెబుతున్నా కూడా ఎక్కడి వారక్కడే తమకి తాముగా లాక్డౌన్ వేసుకుంటున్నారు. అయితే థియేటర్లు లేని కారణంగా సినిమాని ఎంజాయ్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్.. ఓటీటీ.
అయితే మొన్నటి వరకూ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకి సరైన స్పందన రాలేదు. థియేటర్లో రిలీజ్ చేసినా సరైన స్పందన రాదనుకున్న సినిమాలనే ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శలకి చెక్ పెడుతూ ఓటీటీ ద్వారా రిలీజైన రెండు సినిమాలు తమ సత్తా చాటుతున్నాయి. ఆ రెండు సినిమాలే.. క్రిష్ణ అండ్ హిస్ లీల, భానుమతి అండ్ రామక్రిష్ణ.
అయితే ఈ రెండూ ప్రేమకథా చిత్రాలే కావడం విశేషం. క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రంలో ఇద్దరు అమ్మాయిలని ఒకే టైమ్ లో ప్రేమించే అబ్బాయిగా సిద్ధు జొన్నలగడ్డ నటిస్తే, భానుమతీ అండ్ రామక్రిష్ణ చిత్రంలో ముఫ్పై ఏళ్ళకి పైబడ్డ ఇద్దరు యువతీ యువకుల మధ్య కలిగే ప్రేమని చూపించారు. ఈ రెండు చిత్రాలకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.
దాంతో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలపై ఆసక్తి పెరిగింది. మరి ఆ ఆసక్తి ఇలా నిలిచి ఉన్నప్పుడే మరిన్ని తెలుగు చిత్రాలు ఓటీటీ ద్వారా పలకరిస్తాయేమో చూడాలి.