సుకుమార్ రంగస్థలం తర్వాత భారీ బడ్జెట్‌తో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కరోనా లాక్‌డౌన్ లేకపోతే ఈపాటికి సెట్స్ మీద ఉండేది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్‌గాను, రాయలసీమ భాష మాట్లాడే అమ్మాయిగాను నటించబోతుంది. ఇక బన్నీ లారీ డ్రైవర్‌గా పక్కా ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. బన్నీ పుష్ప ఫస్ట్ లుక్ తోనే అందనంత క్రేజ్ సంపాదించాడు.
అయితే ఈ రష్మిక మందన్నని హీరోయిన్‌గా అనుకోకముందు.. హీరోయిన్ ఆఫర్ రంగస్థలంలో రామలక్ష్మిగా డీ గ్లామర్ రోల్ లో అదరగొట్టిన సమంతకి వచ్చిందట. సుకుమార్ పుష్పలో సమంత అయితే డీ గ్లామర్ రోల్ తో రాయలసీమ భాషతో అదరగొడుతుంది అని భావించి సమంతని సంప్రదించడం, సమంత కూడా ఒకసారి అలాంటి పాత్ర చేసి ఉన్నాను, అయినా ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు కానీ, మరే ఇతర సినిమాలు కానీ ఒప్పుకోవడం లేదని... సుకుమార్ ఇచ్చిన భారీ ఆఫర్‌ని తిరస్కరించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం అసలు సుకుమార్ పుష్ప కోసం సమంతని సంప్రదించలేదని... రంగస్థలంలో రామలక్ష్మిలా సమంతని చూపించేసాక.. మళ్లీ అలాంటి పాత్రలోనే చూపించడం ఎందుకు అని సుకుమార్ ప్రస్తుతం హిట్స్ మీదున్నా రశ్మికనే ముందు హీరోయిన్ గా అనుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే పుష్ప ఆఫర్ అసలు సమంత దగ్గరకు రాలేదన్నమాట.