హీరోయిన్‌గా పరిచయమై, ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన వాళ్లెంతమందో ఉన్నారు. అది అసాధారణమేమీ కాదు. కానీ ఐటమ్ గాళ్‌గా పేరు తెచ్చుకొని, సినిమా సినిమాకీ ఇమేజ్ పెంచుకుంటూ హీరోయిన్ రేంజికి ఎదిగిన తారలు అరుదు. తెలుగులో సిల్క్ స్మిత తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేసే తార ఇంతవరకూ రాలేదు. కానీ కనీసం ఆ స్థాయికి వస్తుందని నమ్మకం కలిగించిన తార ఒకరున్నారు. ఆమె తెలుగమ్మాయి కాదు. కనీసం దక్షిణాది తార కూడా కాదు. ఆమె ముంబై అమ్మాయి. ఆ మాటకొస్తే ఇండో పాకిస్తానీ. ఆమె తండ్రి భారతీయుడు కాగా, ఆమె తల్లి పాకిస్తానీ. ఆమె.. ముమైత్ ఖాన్!
కొన్నాళ్ల క్రితం కుర్రకారు, వయసు మీరిన వాళ్లు కూడా ఆమె నామం జపించారు. ఫలానా హీరోయిన్ పేరు తెలీదని చెప్పే వాళ్లున్నారేమో కానీ, ముమైత్ అంటే తెలీని వాళ్లు లేరు అన్నంతగా అప్పట్లో ఆమె ఖ్యాతి తెలుగునాట విస్తరించింది. ప్రతి నిర్మాతా తన సినిమాలో ముమైత్ ఉంటే సినిమాకి సగం బలం వచ్చినట్లుగా నమ్మేంతగా ఆమె తన ముద్రని వేసింది.
టాలీవుడ్‌లో మొదట ‘స్వామి’, ‘ఛత్రపతి’ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసినా.. అందరికీ తెలిసింది మాత్రం ‘పోకిరి’ తోటే. ‘‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’’ పాటతో ఆమె పేరు మారుమోగి, రాత్రికి రాత్రే ఐటమ్ స్టార్ అయిపోయింది. విలక్షణమైన మత్తు చూపులు, అణువణువూ శృంగారాన్ని చిందించే దేహంతో ఆమె యువతరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అయితే రోజు రోజుకీ, సినిమా సినిమాకీ ఎదుగుతూ సినిమాకే హైలైట్ అయ్యే స్థాయికి చేరుకుంటుందని అప్పుడు చాలామంది ఊహించలేదు.
రాజశేఖర్-సముద్ర సినిమా ‘ఎవడైతే నాకేంటి’, శ్రీకాంత్-పోసాని మూవీ ‘ఆపరేషన్ దుర్యోధన’ ముమైత్‌లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. శివనాగేశ్వరరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘భూకైలాస్.. ఎకరం యాభై కోట్లు’ లోనూ ఆమె స్పెషల్ ఎట్రాక్షన్. రెండు కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌తో తయారైన ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రం దానికి మూడింతల కలెక్షన్ రాబట్టిందంటే, అందులో ముమైత్ భాగస్వామ్యం చాలానే ఉంది. అందుకే ఆ సినిమా డైరెక్టర్ పోసాని, ‘‘శ్రీకాంత్ తర్వాత నా సినిమాకి ముమైత్ హైలైట్. ప్రేక్షకుల్ని మైమరపించే లక్షణం ఆమెలో పుష్కలంగా ఉంది’’ అని ప్రశంసించారు.
అందుకు తగ్గట్లే ఇతర పాత్రల నుంచి అతి స్వల్ప కాలంలో టైటిల్ రోల్స్ పోషించే స్థాయికి ఎదిగింది ముమైత్. ఆమె టైటిల్ రోల్ చేసిన ‘మైసమ్మ ఐపీఎస్’ పెద్ద హిట్టయింది. భరత్ పారేపల్లి డైరెక్ట్ చేసిన ఆ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేలను ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల దర్శకుడు దాసరి నారాయణరావు అందించడం విశేషం. దాని తర్వాత ‘మంగతాయారు టిఫిన్ సెంటర్’ సినిమాతోనూ ఆమె అలరించింది.
ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే, మరోవైపు ఐటమ్ గాళ్‌గానూ ఆమె కొనసాగుతూ వచ్చింది. పూరి జగన్నాథ్ మూవీ ‘నేనింతే’లో తన నిజ జీవిత పాత్రలోనే ఆమె కనిపించింది. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అయిన ఎ. కోదండరామిరెడ్డి అంతటాయన ముమైత్‌ను డ్యూయల్ రోల్‌లో ప్రెజెంట్ చేస్తూ ‘పున్నమి నాగు’ సినిమా తీశారు. యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన మాగ్నమ్ ఓపస్ ‘మగధీర’ చిత్రంలో ‘‘బంగారు కోడిపెట్ట’’ రీమిక్స్ సాంగ్‌లో ముమైత్ అలరించిన తీరు ఇంకా మన కళ్ల ముందు మెదులుతూనే ఉంది.
అలా 2016 దాకా సినిమాల్లో కనిపిస్తూ వచ్చిన ముమైత్ హఠాత్తుగా వెండితెరపై కనుమరుగైంది. చిన్నతెరపై అడపా దడపా కనిపిస్తూ వస్తోంది. డాన్స్ షో ‘ఢీ’లోనూ, ‘బిగ్ బాస్ 1’ కంటెస్టెంట్‌గానూ దర్శనమిచ్చిన ముమైత్.. ఇప్పుడు లాక్‌డౌన్ టైమ్‌లో సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ వస్తోంది. దశాబ్దం క్రితం పోటీలేని ఐటమ్ గాళ్‌గా చక్రం తిప్పిన ముమైత్ ముచ్చట్లు ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో వినిపించకపోవడం చిత్రసీమ అనేది ఎంతటి మాయాబజారో తెలియజేస్తోంది!!