తెలుగు తెర 2021 వేసవిలో బాగా వేడెక్కబోతోంది. అసలైన హాట్ టాపిక్‌కు ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో తెరలేచింది. ఓవైపు యస్.యస్. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, మరోవైపు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ వేసవికి రానున్నాయి. దాదాపు ఒకే సమయంలో అవి బరిలోకి దిగుతాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సీన్ తెరమీద కంటే తెర బయటే మరింత రక్తికట్టేలా కనిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’, రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాల్లో ఏది బిగ్ హిట్ అవుతుందనే ‘బెట్’లు మొదలయ్యాయి. విశేషమేమంటే ‘బాహుబలి’ మూవీతో ప్రభాస్ మార్కెట్ వేల్యూని దేశవ్యాప్తంగా పెంచింది రాజమౌళి. ‘సాహో’ సినిమా విషయంలో అది నిరూపితమైంది. ఏ సౌతిండియన్ స్టార్‌కు లేని విధంగా నార్త్ ఇండియాలో ఆ మూవీని భారీ రేట్లకు బయ్యర్లు కొనగా, కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వచ్చి, తెలుగునాట కంటే అక్కడే హిట్టయ్యింది. అలా ఏకైక పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు ప్రభాస్.
ఇప్పుడు అదే రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లు ఏ రీతిగా ఉంటాయనే అంచనాలు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ‘బాహుబలి 2’ కలెక్షన్లను అది క్రాస్ చేస్తుందా, లేదా అనే అంశంపై ప్రభాస్ ఫ్యాన్స్, తారక్ అండ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య రసవత్తరమైన చర్చ కొనసాగుతోంది. తెలుగునాట ‘బాహుబలి 2’ రికార్డులను ప్రభాస్ మునుపటి మూవీ ‘సాహో’ అధిగమించలేకపోయింది. అయితే ‘రాధేశ్యామ్’ మూవీ పరిస్థితి అలా ఉండదనీ, ‘ఆర్ఆర్ఆర్’ మూవీని కలెక్షన్ల విషయంలో ఆ సినిమా ఢీకొంటుందనీ ప్రభాస్ ఫ్యాన్స్ గట్టి నమ్మకాన్ని కనపరుస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ కోసం తారక్, చరణ్.. ఇద్దరూ తమ రూపాల్ని మార్చేసుకొని చాలా శ్రమిస్తున్నారు. స్వాతంత్ర్య పూర్వ కాలం నాటి నేపథ్యంలో నడిచే కథ కావడం, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమరం భీమ్ క్యారెక్టర్‌లో తారక్ నటిస్తుండటం వల్ల ఈ సినిమాకు ఓ ప్రత్యేకత సమకూరింది. ఆ ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా ఆ సినిమా చేస్తున్నారు. వారి గెటప్పులతో పోలిస్తే ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ అల్ట్రా మోడరన్ లుక్‌లో ఆకట్టుకోనున్నాడు. ‘సాహో’ ఫలితంతో ఈ సినిమా కోసం అతను మరింతగా శ్రమిస్తున్నాడు.
హీరోయిన్ల విషయానికి వస్తే.. అటు చరణ్, తారక్.. ఇటు ప్రభాస్ ఇప్పటిదాకా జోడీ కట్టని తారలతో నటిస్తున్నారు. ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా, ‘ఆర్ఆర్ఆర్’లో అలియా భట్‌తో చరణ్, బ్రిటీష్ తార ఒలీవియా మోరిస్‌తో తారక్ జత కడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగణ్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ తల్లిగా ఒకప్పటి సంచలన బాలీవుడ్ తార భాగ్యశ్రీ నటిస్తుండటం విశేషం. రెండు సినిమాలూ భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతున్నాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా.. ఆ బడ్జెట్‌ను కుదించుకోక తప్పని స్థితి రెండు సినిమాలకూ ఎదురవుతోంది.
చివరాఖరికి ఈ రెండు సినిమాల విడుదల తేదీలు ఎప్పుడు వెల్లడవుతాయి, రిలీజ్ టైమ్‌కు ఎలాంటి పోటీ వాతావరణం నెలకొంటుంది, బాక్సాఫీస్ దగ్గర ఏ మూవీది పైచేయి అవుతుందనేవి ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశాలు.