ప్రస్తుతం కరోనా విజృంభణతో సినిమా షూటింగ్స్ మొత్తం వెనక్కి వెళ్లాయి. కార్మికులు పొట్ట కూటి కోసం, నిర్మాతల బాగు కోసం సినిమా షూటింగ్స్ మొదలెట్టాలని తిరిగిన చిరు అండ్ గ్యాంగ్ కరోనా పెరగడంతో కామ్ అయ్యారు. ఎవ్వరూ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి సిద్ధంగా లేరు. RRR తో రాజమౌళి అయినా ధైర్యం చేస్తాడనుకుంటే.. రాజమౌళి కూడా చేతులెత్తెయ్యడంతో.. మళ్ళీ మొదటికే వచ్చింది. దానితో సినిమా షెడ్యూల్స్, విడుదల తేదీలన్నీ తారుమారయ్యాయి. జనవరిలో సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాలన్నీ వేసవికి షిఫ్ట్ అయ్యేలా ఉన్నాయి. రేపో మాపో విడుదల కావాల్సినవి దసరాకైనా విడుదలయ్యేలా చూడాలని కరోనాకి దణ్ణం పెడుతున్నారు. అలాగే దసరా సినిమాల్ని డిసెంబర్‌కి ఇలా అన్ని సినిమాల విడుదల తేదీలన్నీ తారుమారయ్యాయి. దానితో హీరోల డేట్స్ మొత్తం మారిపోయాయి.
ఎన్టీఆర్ RRR షూటింగ్‌తో బయటికిరాలేక త్రివిక్రమ్‌తో సినిమాని వెయిటింగ్‌లో పెట్టాలి. మరోపక్క ప్రభాస్ రాధే శ్యాంతో నాగ్ అశ్విన్ మూవీ హోల్డ్‌లో పెట్టాలి, అలాగే రామ్ చరణ్ RRR కోసం ఆచార్య మూవీ విషయంలో ఏం చెయ్యాలో తెలియక తికమక అవుతున్నారు. పుష్ప కోసం బన్నీ, మహేష్ సర్కారు వారి పాట ఇలా అన్నీ ఆలస్యం అయ్యేలా ఉన్నాయి. ఇక రామ్ చరణ్ అయితే మరీ లాకయ్యాడు. RRR తో పాటుగా ఆచార్య సినిమాకోసం చరణ్ డేట్స్ సర్దుబాటు చేయాలి. కానీ.. ప్రస్తుతం RRR అయ్యాకే ఆచార్య. అలా ఆచార్య కి రామ్ చరణ్ డేట్స్ ఇవ్వడం మాత్రం కలలానే ఉంది. మరోపక్క రామ్ చరణ్.. పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబో మూవీ విరూపాక్షలో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరస సినిమాలు చేస్తున్నాడు. కరోనా లేకపోతే.. ఈపాటికి పవన్ సినిమాలు సెట్స్ మీదుండేవి. మరి ఇలాంటి సమయంలో రామ్ చరణ్ పవన్ సినిమాలో అంటే నమ్మే విషయం కాదు. RRRకి లాక్ అయిన చరణ్ ఆచార్యకే కష్టంగా ఉంటే.. పవన్ విరూపాక్షలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ అంటూ కామెడీ చేస్తున్నారని అంటున్నారు సినీ ప్రియులు.