అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. లారీ డ్రైవర్ గా బన్నీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
చిత్తూరు ప్రాంత నేపథ్యంలో సాగే ఈ కథ కోసం ఎక్కువ మంది నటులని అక్కడి వారినే తీసుకున్నారట. బన్నీ కూడా చిత్తూరు యాసలోనే మాట్లడతాడని సమాచారం. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక రంగస్థలం సినిమాలో సమంత పాత్రని గుర్తు చేస్తుందట. అయితే సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి చాలా ప్రత్యేకత ఉంటుంది. మొదటి సినిమా ఆర్య నుండి చూసుకుంటే, రంగస్థలం వరకు ప్రతీ ఐటెం నంబర్ హిట్టే.
పుష్పలోనూ మంచి ఐటెం సాంగ్ ఉండనుందట. అయితే ఈ పాటలో బన్నీ సరసన స్టెప్స్ వేయడానికి బాలీవుడ్ భామని తీసుకోవాలనుకున్నారు. ఊర్వశి రౌతెలా ని సంప్రదించారట. కానీ ఆమె రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో వద్దనుకున్నారట. అయితే మరో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లని అనుకున్నప్పటికీ వర్కౌట్ కావడం లేదని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం స్పెషల్ సాంగ్ లో పాయల్ రాజ్ పుత్ కనిపించనుందని అంటున్నారు.
ఆర్ ఎక్స్ 100 సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ బన్నీతో స్టెప్పులు వేయనుందని వినబడుతుంది. మరి ఈ విషయంలో చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే మంచి అవకాశమే అని చెప్పాలి.