సున్నితమైన ప్రేమకథల్ని వెండితెరపై అందంగా చూపించగల దర్శకుడు శేఖర్ కమ్ముల ఇప్పటి వరకూ స్టార్ హీరోతో సినిమా చేయలేదు. హ్యాపీడేస్ మొదలుకుని, మొన్నటి ఫిదా వరకూ గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. అప్పుడెప్పుడో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చినా అదెందుకో వర్కౌంట్ అవలేదు. అయితే తాజాగా శేఖర్ కమ్ములకి స్టార్ హీరో దొరికాడని, విక్టరీ వెంకటేష్ ని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకి వచ్చేసింది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చాక మిగతా భాగం చిత్రీకరణ జరుపుకోనుందని అంటున్నారు. అందువల్ల ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని, రిలీజ్ అవ్వడానికి వచ్చే ఏడాది పడుతుందని భావిస్తున్నారు.
సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా నెమ్మది. ఒక సినిమాని మొదలెట్టాడంటే దాన్ని చాలా రోజుల వరకి చెక్కి చెక్కీ ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తాడు. అదీగాక ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా కథ రాసుకుంటాడని అంటుంటారు. అలాంటపుడు వెంకటేష్ తో సినిమా అని వస్తున్న వార్తల్లో నిజం ఉండకపోవచ్చని అంటున్నారు. సోషల్ మీడియాలో పుట్టే అనేక రకాల పుకార్లలో ఇది కూడా ఒకటై ఉంటుందని చెబుతున్నారు. మరి ఇది నిజంగా పుకారేనా, లేదా నిజమా అన్నది ఎవరో ఒకరు స్పందిస్తేనే తెలుస్తుంది.