రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఘాజీ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ తెలుగులో అలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుండి సంకల్ప్ రెడ్డి చిత్రాలంటే ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. అందరిలా కాకుండా తనకి తానుగా ఓ డిఫరెంట్ పాథ్ ని ఎంచుకుని సినిమాలు తీసే సంకల్ప్, వరుణ్ తేజ్ హీరోగా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో అంతరిక్షం పేరుతో తన రెండవ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.
అయితే ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దాని తర్వాత సంకల్ప్ రెడ్డి నెట్ ఫ్లిక్స్ లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ లో కొంత పార్ట్ ని డైరెక్ట్ చేసాడు. అయితే తన మూడవ చిత్రం ఎవరితో ఉంటుందనే విషయమై గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ వార్తలకి తెరపడింది. అంతరిక్షం తర్వాత బాలీవుడ్ సినిమాకి శ్రీకారం చుట్టాడు. కమెండో చిత్రంలో హీరోగా మెప్పించిన విద్యుత్ జమాల్ హీరోగా బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడు. సంకల్ప్ గత సినిమాల లాగే ఈ చిత్రం కూడా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఉండనుందట.
ఘాజీ సినిమాతో సముద్రాన్ని, అంతరిక్షం సినిమాతో ఆకాశాన్ని తాకిన సంకల్ప్, ఈ సారి ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే సినిమాతో వస్తున్నాడట. మరి ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడి చేస్తారట. వచ్చే ఏడాదికి సెట్స్ మీదకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు.