తమిళంలో స్టార్‌గా ఎదిగిన తెలుగు యువకుడు విశాల్ త్వరలో చక్ర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన విశేషమేమంటే దక్షిణాది నాలుగు భాషల్లో ఇది విడుదల కానున్నది. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి ఎం.ఎస్. ఆనందన్ డైరెక్టర్. రెజీనా కసాండ్రా ఒక కీలక పాత్ర చేస్తోంది. ఇదివరకు తెలుగులో విశాల్ సినిమా వస్తోందంటే ఒక బజ్ కనిపించేది. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ వెల్లడయ్యేది. ఇప్పుడు అలాంటిదేమీ విశాల్ సినిమాకు కనిపించడం లేదు. ఇప్పుడొస్తోన్న ‘చక్ర’ మూవీని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పడం లేదు. కొంత కాలంగా విశాల్ సినిమాలకు తెలుగునాట ఇదే స్థితి కనిపిస్తోంది. ఆదరణ పరంగా ‘పందెంకోడి’ నాటి విశాల్‌కీ, ఇప్పటి విశాల్‌కీ తెలుగు ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. అది.. డౌన్‌ట్రెండ్‌లో ఉండటమే గమనించాల్సిన విషయం.
నిజానికి 2005లో వచ్చిన ‘పందెంకోడి’ (తమిళ ఒరిజినల్ ‘సండకోళి’) సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలని విశాల్ తండ్రి జి.కె. రెడ్డి ప్లాన్ చేసినప్పుడు విశాల్ మొదట ఇష్టపడలేదు. ఆ స్టోరీని తెలుగు ప్రేక్షకులు ఇష్టపడతారో, లేదోననేది అతడి సందేహం. లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఆ సినిమా తెలుగునాట విడుదలై, పెద్ద హిట్టయి విశాల్‌కు ఇక్కడ మార్కెట్‌ను క్రియేట్ చేసింది. దాని తర్వాత ‘పొగరు’, ‘భరణి’ సినిమాలు కూడా ఆడటంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ విశాల్ పాగా వేసేశాడని చాలామంది భావించారు. తను కూడా అలాగే అనుకున్నట్లుగా తర్వాత ఒక సినిమాని ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో చేశాడు. ఆ సినిమా ‘సెల్యూట్’ (తమిళంలో ‘సత్యం’). నయనతార నాయికగా నటించిన ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది.
దాంతో తమిళ, తెలుగు బైలింగ్యువల్ మూవీలను పక్కనపెట్టి, గతంలో మాదిరిగానే తమిళంలో చేసిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చెయ్యడం కొనసాగించాడు విశాల్. ‘పిస్తా’ ఓ మోస్తరుగా ఆడగా, ‘కిలాడీ’ డిజాస్టర్ అయ్యింది. మెల్లకన్నుతో ప్రయోగాత్మకంగా ఆర్యతో కలిసి చేసిన ‘వాడు వీడు’ ఫర్వాలేదనిపించేట్లు నడిచింది. తిరు డైరెక్ట్ చేసిన ‘వేటాడు వెంటాడు’ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. భూపతి పాండ్యన్ రూపొందించిన ‘ధీరుడు’ మూవీ సంగతి కూడా అంతే. తమిళంలో హిట్టయిన ‘పల్నాడు’ ఇక్కడ హిట్ కాలేదు. సొంత బేనర్‌లో చేసిన ‘ఇంద్రుడు’ సినిమా డిజాస్టర్ అయ్యింది. విశాల్ అండర్‌కవర్ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన ‘జయసూర్య’ మూవీని ఆడియెన్స్ ఆదరించలేదు. ‘కథకళి’ కథ కంచికి చేరింది. తమన్నాతో జోడీకట్టి చేసిన ‘ఒక్కడొచ్చాడు’ చిత్రాన్ని ఎప్పుడొచ్చినా చూడమన్నారు జనం.
మిస్కిన్ డైరెక్ట్ చేసిన ‘డిటెక్టివ్’ను మాత్రం బాగా చూశారు తెలుగువాళ్లు. కంటెంట్ ఇంటరెస్టింగ్‌గా, కొత్తగా ఉండటమే దీనికి కారణం. సమంత జోడీగా విశాల్ చేసిన ‘అభిమన్యుడు’ మూవీని కూడా ఆదరించారు. నేటి టెక్నాలజీతో ఎలాంటి దారుణాలు చేయొచ్చో డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ చూపించిన తీరు ప్రేక్షకులకు నచ్చింది. వరుసగా రెండు సినిమాలు అటు తమిళంలో, ఇటు తెలుగులో హిట్టయ్యేసరికి విశాల్‌కు మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. తెలుగునాట తన ఫ్యాన్ బేస్ పెరిగిందని సంబరపడ్డాడు. లింగుస్వామితో మరోసారి జోడీకట్టి ‘పందెకోడి 2’ అంటూ వచ్చాడు. జనం లాభం లేదన్నారు. ఆల్‌రెడీ జూనియర్ ఎన్టీఆర్ చేయగా హిట్టయిన ‘టెంపర్’ సినిమాని ‘అయోగ్య’ పేరుతో చేస్తే తెలుగువాళ్లు ఎందుకు చూస్తారనే ఆలోచన లేకుండా వచ్చాడు, దెబ్బతిన్నాడు. మరోసారి తమన్నాతో జతకట్టి పోయినేడు నవంబర్‌లో ‘యాక్షన్’ అంటూ భారీ హంగామాతో వచ్చాడు. ఆ హంగామాని జనం పట్టించుకోలేదు.
ఇలా వరుసగా విశాల్ మూడు సినిమాలను తెలుగువాళ్లు ఆదరించలేదు. కంటెంట్ కొత్తగా, ఆసక్తికరంగా ఉంటేనే వాళ్లు ఎవరి సినిమాలనైనా చూస్తున్నారని కొంతకాలంగా విజయం సాధిస్తున్న సినిమాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ‘చక్ర’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు విశాల్. అయితే ఇప్పుడు థియేటర్లు మూతపడి ఉండటంతో విశాల్ ఎంత హడావిడి చేసినా ఆ మూవీకి బజ్ క్రియేట్ కావట్లేదు. ఒకవేళ థియేటర్లు రీస్టార్ట్ అయినా కూడా ‘చక్ర’ మూవీని చూసేందుకు జనం కదులుతారా? తమిళనాట ప్రముఖుడిగా పేరు తెచ్చుకున్న విశాల్‌ను ఆదరిస్తారా? డౌటే.