మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకి నిర్మాత అయిన అనిల్ సుంకర తాజాగా ఓ బిగ్ అనౌన్స్ మెంట్ తో మన ముందుకి వచ్చాడు. ప్రస్తుతం ఓటీటీలకి, మరీ ముఖ్యంగా వెబ్ సిరీస్ లకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సినిమా నిర్మాతలు తాము కూడా వెబ్ సిరీస్ ని రూపొందించాలని భావిస్తున్నారు. వారి బాటలోనే అనిల్ సుంకర్, వెబ్ సిరీస్ తీసే ప్లాన్ లో ఉన్నాడు. అయితే తన వెబ్ సిరీస్ కోసం ప్రఖ్యాత నవలా రచయిత మధుబాబు రచించిన షాడో నవలా సిరీస్ ని ఎంచుకున్నాడు.
తెలుగు నవలలు చదివే వారందరికీ మధుబాబు షాడో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో షాడో అందరికీ సుపరిచితమే. అయితే భారతదేశంలో అతిపెద్ద నవలా సిరీస్ ని దృశ్యరూపంలో అతిపెద్ద వెబ్ సిరీస్ గా రూపొందించేందుకు అనిల్ సుంకర సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ సిరీస్ లో హీరోగా ఎవరు నటించనున్నారనేది మాత్రం వెల్లడి చేయలేదు.
మరి తెలుగు పాఠకులని ఉర్రూతలూగించిన మధుబాబు షాడో, దృశ్యరూపంలో ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.