ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయమైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు పూరి ఆకాష్, ఆ తర్వాత తండ్రి దర్శకత్వంలో మెహబూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి జగన్నాథ్ సినిమాలకి పూర్తి భిన్నంగా రూపొందిన ఈ చిత్రంలో ఆకాష్ నటనకి మంచి మార్కులే పడినప్పటికీ, సినిమా పరంగా బాక్సాఫీసు వద్ద తేలిపోయింది. అయితే కొడుక్కి సక్సెస్ ఇవ్వాలన్న తపనతో పూరి జగన్నాథ్ మరోమారు తాను రాసిన కథతో పూరి కనెక్ట్స్ బ్యానర్ లో రొమాంటిక్ అనే టైటిల్ తో చిత్రాన్ని తెరకెక్కించాడు.
అనిల్ పాదూరి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్ర షూటింగ్ పూర్తయిందట. ముంబయి అమ్మాయి కేతిక శర్మా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం నుండి రిలీజైన పోస్టర్లకి, పాటలకి మంచి స్పందన వచ్చింది. అయితే ప్రస్తుతం ఓటీటీ వేదిక ద్వారా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో రొమాంటిక్ చిత్ర బృందానికి ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్ నుండి మంచి ఆఫర్ వచ్చిందట. దాంతో చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్ ఆలోచనలో పడ్డాడని వినిపిస్తుంది.
తన కొడుకు నటించిన ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేయాలా లేదా థియేటర్లు ఓపెన్ అయ్యే వరకూ వెయిట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాడట. అయితే ఒక్కసారి థియేటర్లు తెరుచుకున్నాక పెద్ద సినిమాల హవా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న సినిమాలకి థియేటర్లు దొరక్క సమస్య ఏర్పడుతుంది. అందువల్ల రొమాంటిక్ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేస్తేనే బెటర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ విషయమై పూరి జగన్నాథ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.