గత కొన్ని రోజులుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకి సరైన స్పందన రావట్లేదు. లాక్డౌన్ మొదలయినప్పటి నుండి ఇప్పటి వరకూ అనేక చిత్రాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి. తెలుగులో అమృతరామమ్, తమిళంలో పొన్మగల్ వంధాల్, హిందీలో అమితాన్ నటించిన గులాబో సితాబో చిత్రాలకి నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాలతో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన కీర్తి సురేష్ చిత్రం పెంగ్విన్ కి సైతం డివైడ్ టాక్ వచ్చింది.
దీంతో ఓటీటీలు ఫ్లాప్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ గా మారాయన్న టాక్ బాగా వినబడింది. సరిగ్గా ఆడవని అనుకున్న చిత్రాలని అయినకాడికి అమ్మేసి చేతులు దులిపేసుకుందాం అన్న ధోరణీలోనే నిర్మాతలు ఉన్నారని, అందుకే ఓటీటీలో పేలవమైన చిత్రాలు వస్తున్నాయని విమర్శించారు. దీంతో ఓటీటీకి కూడా హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఏ హంగూ ఆర్భాటం లేకుండా, కనీసం మినిమమ్ ప్రమోషన్స్ కూడా చేయకుండా ఒక సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
క్షణం దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నట్లు వినిపిస్తున్నాయి. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్, వయాకామ్ 18 సంయుక్తంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేశాడు. న్యూ ఏజ్ రొమాంటిక్ గా కొత్తగా ట్రై చేసారని అంటున్నారు. దీంతో ఓటీటీకి ఫస్ట్ హిట్ పడిందని చెప్పుకుంటున్నారు.