నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వి సినిమా కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో హోల్డ్ లో పడిపోయింది. అయితే ప్రస్తుతం నాని హీరోగా అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కనున్న శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి రోజూ వార్తలు వస్తున్నాయి. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రిత్యయాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో నాని రొమాన్స్ చేయనున్నాడట.
ప్రధాన హీరోయిన్ గా సాయిపల్లవి పల్లెటూరి అమ్మాయిగా లంగాఓణీలో దర్శనమివ్వబోతుందని అంటున్నారు. ఇక మిగిలిన రెండు పాత్రల్లో ఎవరినీ తీసుకోవాలా అనే డైలామా ఇంకా కొనసాగుతుందట. మొదట రష్మిక పేరు వినిపించినప్పటికీ, సెకండ్ హీరోయిన్ గా చేయడానికి ఆమె నిరాకరించిందని సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం ఈ రెండు పాత్రలకి హీరోయిన్లు దొరికేసారని అంటున్నారు.
తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందుతున్న మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న మాళవికా మోహనన్ తో పాటు అడవి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం గూఢాచారి ఫేమ్ శోభిత ధూళిపాళ్లని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తెలుగమ్మాయి అయిన శోభితా ధూళిపాళ్ల బాలీవుడ్ లో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లలోనూ నటించింది. మరి ఈ భామకి మరోసారి తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తుందో లేదో చూడాలి.