‘‘నేను చేసే సినిమాలు ఎటు తీసుకెళితే అటు వెళ్తాను. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని అటు వెళ్లడానికి ప్రయత్నిస్తాను’’.. అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాగార్జున. కానీ ఆయన నాలుగేళ్ల నుంచీ ఎటు వెళ్తున్నారో అర్థం కావట్లేదని ఆయన అభిమానులే అంటున్నారు. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత ఆ రేంజి హిట్ కావాలని, ఆ తరహా ఎంటర్‌టైనర్ కావాలని వారు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఆ మూవీలో తండ్రీ కొడుకులుగా నాగార్జున డబుల్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తండ్రి బంగార్రాజు క్యారెక్టర్‌లో ఆయన అమిత వినోదాన్ని పండించారు. రమ్యకృష్ణతో ఆయన చేసే సరసాలు పెద్దవాళ్లనే కాకుండా యూత్‌ను కూడా అలరించాయి. కొడుకు క్యారెక్టర్ జోడీగా లావణ్యా త్రిపాఠి సరిగ్గా సరిపోయి, విశ్లేషకుల్ని సైతం విస్మయానికి గురిచేసింది. ఆ కపుల్ స్క్రీన్‌మీద ఎలాగుంటుందోనని సందేహించిన వాళ్లను ఆశ్చర్యపరుస్తూ నాగ్-లావణ్య జంట ఆకట్టుకుంది. నాగ్ కెరీర్‌లోనే ‘సోగ్గాడే చిన్నినాయనా’ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆయనలో వాడి ఏమాత్రం తగ్గలేదని బంగార్రాజుగా ఆయన ప్రదర్శించిన అభినయం తెలిపింది.
కానీ ఆ మూవీ తర్వాత ఆయన తన ఫ్యాన్స్‌ను అలరించే సినిమాని ఇంతవరకూ అందించలేకపోయారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో చేసిన సినిమా ‘ఊపిరి’.. నాగ్ కంటే కార్తీకే ఎక్కువ మైలేజ్‌నిచ్చింది. వీల్‌చైర్‌కి అంకితమైన క్యారెక్టర్‌లో నాగ్ పర్ఫార్మెన్స్‌ను ఫ్యాన్స్ ఎంజాయ్ చెయ్యలేకపోయారు. విమర్శకులు మెచ్చిన ఆ సినిమా తనకు ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చిందని ఆ సినిమా ప్రొడ్యూసర్ పొట్లూరి వరప్రసాద్ స్వయంగా ప్రకటించారు. దాని తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమైన ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో తన నిజ జీవిత పాత్రనే పోషించారు నాగ్. దాని వల్ల ఆయనకు కాస్త కూడా లాభం కలగలేదు.
2017లో హాథీరామ్ బాబా జీవిత కథతో కె. రాఘవేంద్రరావు రూపొందించిన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో హాథీరామ్‌గా నాగార్జున నటించారు. అదెంత డిజాస్టర్ అయ్యిందంటే విడుదలైన తొలి రోజే థియేటర్లకు మెయిన్‌టెనెన్స్ డబ్బులు కూడా రాలేదు. ఇది నాగార్జున ఏమాత్రం ఊహించని విషయం. దాని తర్వాత ఓంకార్ డైరెక్షన్‌లో ‘రాజుగారి గది 3’ చేశారాయన. అందులోనూ ఆయన హీరో క్యారెక్టర్ కాకుండా స్పెషల్ రోల్ చేశారు. అదీ ఆడలేదు. అప్పుడు వచ్చింది ‘శివ’ కాంబినేషన్ మూవీ ‘ఆఫీసర్’. రామ్‌గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి తొలిరోజు తొలి ఆటకే ఈగలు తోలుకున్నారు థియేటర్ల వాళ్లు. కొన్ని చోట్ల ఫస్ట్ షో నుంచి వేరే సినిమా వేసుకున్నారంటే.. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ అలాంటిదన్న మాట. నాగ్ కెరీర్‌లోనే అత్యంత చెత్త, అతిపెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది ‘ఆఫీసర్’.
మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తే తమ ప్రాధాన్యం తగ్గిపోతుందనో, ఇంకొకరితో సక్సెస్ షేర్ చేసుకోవడం ఇష్టంలేకనో, ఇమేజ్ చట్రంలో ఇరుక్కొనో చాలామంది స్టార్లు మొన్నటి దాకా ఆ తరహా సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు. కానీ చాలా కాలం నుంచీ ఇద్దరు హీరోల సినిమాల్లో నటిస్తూ తనకు ఎలాంటి ఇగో లేదని నాగార్జున తెలియజేస్తూ వస్తున్నారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అదే కోవలో నానితో తెరను పంచుకుంటూ ‘దేవ దాస్’ మూవీ చేశారు. అందులో గ్యాంగ్‌స్టర్ దేవాగా నటించారు. కానీ ఆ సినిమా కూడా ఫ్లాపయింది.
ఇక గత ఏడాది ‘ఐ డు’ అనే ఫ్రెంచ్ ఫిల్మ్‌కు రీమేక్‌గా ‘మన్మథుడు 2’ సినిమా చేశారు నాగ్. శోచనీయమైన విషయమేమంటే ఆ సినిమా ద్వారా ఆయన తిట్లు తింటే, హీరోయిన్‌గా చేసిన రకుల్‌ప్రీత్ ప్రశంసలు అందుకుంది. అలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాని, కాసనోవా టైప్ క్యారెక్టర్‌ను అరవై ఏళ్ల వయసులో చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే కనీస ఆలోచన లేకుండా చేసి, తీవ్ర విమర్శల పాలయ్యారు నాగార్జున. ఇంక ఆయన ఏమాత్రమూ ‘మన్మథుడు’ కాడంటూ అక్షింతలు పడ్డాయి.
ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారనే విషయంలో తప్పులో కాలువేసి, ఒకదాని తర్వాత ఒకటిగా తప్పులు చేస్తూ, రాంగ్ స్క్రిప్ట్స్ ఓకే చేస్తూ, ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తూ వస్తున్న నాగార్జున.. ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘ఊపిరి’ రైటర్ అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ఏసీపీ విజయ్ వర్మ అనే క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ, ఇంతదాకా దీనిపై బజ్ అనేది లేదంటే.. నాగ్ సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లిందనిపిస్తోంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుందనే ప్రచారం కూడా నడుస్తోంది.
నాగ్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ హీరోలుగా వచ్చేశారు. ‘‘ప్రేక్షకులు ఎన్నాళ్లు నన్ను హీరోగా చూస్తారో అంతదాకా చేస్తాను. వాళ్లు చూడలేం, వద్దు.. అన్నప్పుడు వేరే దోవ చూసుకుంటాను’’ అని ఒకప్పుడు చెప్పిన నాగ్.. మునుముందు ఏం చేస్తారో చూడాల్సిందే.