నాలుగేళ్ల తర్వాత వచ్చిన అద్భుత విజయం.. బన్నీని అడ్డుకొనేదెవరు?
నిరీక్షణ ఫలించింది. ‘అల.. వైకుంఠపురములో’ అద్భుత విజయం లభించింది. నాలుగేళ్ల తర్వాత అల్లు అర్జున్ ముఖం నిజమైన ఆనందంతో వెలిగిపోయింది. 2016లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా తర్వాత తమ హీరోకు అలాంటి బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ విడుదలైనప్పుడు ఇండస్ట్రీలో రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. మహేశ్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ ముందు ఆ సినిమా నిలబడటం కష్టమని కొంతమంది పనిగట్టుకొని మరీ ప్రచారం చేశారు. సినిమా కథలో లాజిక్ లేదనీ, పాత కాలం నాటి తరహా కథతో త్రివిక్రమ్ ఆ సినిమా చేశాడనీ విమర్శించారు. బన్నీ క్యారెక్టరైజేషన్ సరిగా లేదనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. కానీ అవేవీ సాధారణ ప్రేక్షకులకు పట్టలేదు. ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాన్ని చూసేందుకు వాళ్లు మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చారు.
టాలీవుడ్‌లో బాక్సాఫీస్ పరంగా ‘బాహుబలి 2’ సినిమా కొన్ని పారామీటర్స్‌ను నెలకొల్పింది. వాటిని అందుకోవడం అంత ఈజీగా సాధ్యపడే వ్యవహారం కాకపోవడంతో ‘నాన్ బాహుబలి 2 రికార్డులు’ అంటూ సరిపెట్టుకోవాల్సిన స్థితి ఏర్పడింది. అట్లా ‘అల వైకుంఠపురములో’ నాన్ బాహుబలి 2 రికార్డులు సృష్టించిందని ట్రేడ్ విశ్లేషకులు తేల్చారు. సినిమాలో బన్నీ చేసిన ప్రతి ఫైట్‌కూ థియేటర్లు చప్పట్లతో, విజిల్స్‌తో మారుమోగాయి. క్లైమాక్స్ ఫైట్ అయితే మరీ. అలాగే టేబుల్ సీన్‌కు జనం డాన్స్‌లు చేశారు.
‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న బన్నీతో త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ ప్రాజెక్టుని ప్రకటించినప్పుడు, వాళ్ల మునుపటి సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరహాలో ఓ ఫ్యామిలీ డ్రామా వస్తుందనీ, ఆడితే మామూలుగా ఆడుతుందనీ, లేకపోతే ‘అజ్ఞాతవాసి’ తరహాలో డిజాస్టర్ అవుతుందనీ చిత్రసీమలోని చాలామంది తీర్మానించేశారు. ‘సరైనోడు’ తర్వాత బన్నీ చేసిన ‘దువ్వాడ జగన్నాథమ్’ ఓ మాదిరిగా ఆడితే, ‘నా పేరు సూర్య’ డిజాస్టర్ కావడం, ఇటు త్రివిక్రమ్ మునుపటి సినిమా ‘అజ్ఞాతవాసి’ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడం దీనికి కారణం.
అయితే బన్నీ, త్రివిక్రమ్.. ఇద్దరూ మంచి ఆకలి మీద ఉన్నారనీ, ఈసారి ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలనే కసితో ఉన్నారనీ ‘అల వైకుంఠపురములో’ సినిమా రిలీజయ్యాక అర్థమైంది. వాళ్ల కాంబినేషన్‌లో హ్యాట్రిక్ నమోదయ్యింది. మునుపటి సినిమాలు ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలతో పోలిస్తే అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బన్నీ ఇమేజ్ అనూహ్య స్థాయిలో పెరిగింది. ఆ విషయం అతడి లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు తెలిసింది. స్టైలిష్ లుక్‌లో బన్నీ ఎలా ఆకట్టుకుంటాడో, చింపిరిజుట్టు, గవిరిగడ్డం వేసుకొని రగ్‌డ్ లుక్‌లోనూ అతను అలాగే ఆకట్టుకున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా కావడం, ఆ ఇద్దరి కాంబినేషన్‌పై ఉన్న నమ్మకంతో ‘పుష్ప’ సైతం సరికొత్త రికార్డులు సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ అయితే బన్నీని అడ్డుకోవడం మిగతా స్టార్లకు కష్టమే!