‘శ్రావ్స్.. ఐ లవ్ యూ’ అంటూ అమాయకంగా ముఖంపెట్టి తన సీనియర్‌ను సిన్సియర్‌గా ప్రేమించిన టైసన్ ఇప్పటికీ మన కళ్లముందు మెదులుతూనే ఉన్నాడు. ఎందుకంటే అతడి ప్రేమలోని అమాయకత్వం, అప్పటికే కాలేజీలో తన సీనియర్ ఒకడికి లవర్‌గా చెప్పుకుంటున్నప్పటికీ స్రవంతి వెంటపడే ధైర్యం, ‘ఎంతైనా వాడూ మన ఫ్రెండే కదరా’ అనడంలో స్నేహంపై అతడికున్న నమ్మకం.. ‘హ్యాపీడేస్’లో టైసన్ క్యారెక్టర్ పట్ల ప్రేక్షకుల్లో ఇష్టాన్ని కలిగించింది. అసలు పేరు రాహుల్ అయినప్పటికీ టైసన్‌గా కుర్రకారు అభిమానాన్ని పొందిన అతను ఇప్పుడెక్కడున్నాడు? ఏమైపోయాడు?
నిజామాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కుమారుడైన రాహుల్ హరిదాస్ హైదరాబాద్‌లో బీబీఏ చేశాడు. తర్వాత ఏం చేద్దామా? అని ఆలోచిస్తున్న సమయంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇచ్చిన యాడ్ అతడిలో ఆశలను చిగురింపజేసి, ఆడిషన్‌కు అటెండయ్యేలా చేసింది. ‘హ్యాపీడేస్’లో క్లిష్టమైన టైసన్ క్యారెక్టర్‌కు రాహుల్‌ను ఎంపిక చేశాడు శేఖర్. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మొదట్లో ఇన్‌సెక్యూర్‌గా ఫీలయ్యాడు. చివరకు శేఖర్ ఏం చెబితే గుడ్డిగా అది చేసుకుంటూ వచ్చాడు. వరుణ్ సందేశ్, నిఖిల్‌తో సమానంగా అతడికీ గుర్తింపు వచ్చింది. దానికి అతడి డైలాగ్ డిక్షన్ కూడా కారణమే. అది అతడు మామూలుగా మాట్లాడేదానికి భిన్నమైన డిక్షన్. టెర్రస్ సీన్‌లో దారితప్పిన ఫ్రెండ్ గురించి అతడు మాట్లాడే తీరు కుర్రకారుకు అమితంగా నచ్చేసింది. వాళ్లకే కాదు.. ప్రకాశ్‌రాజ్ వంటి యాక్టర్, సుకుమార్ వంటి డైరెక్టర్ కూడా అతడి నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
ఇప్పుడది గతం. ‘హ్యాపీడేస్’ తెచ్చిన పేరుతో రాహుల్ ఈపాటికి నటుడిగా మంచి స్థాయిలో ఉండి ఉండాలి. మంచి కెరీర్‌ను నిర్మించుకొని ఉండాలి. అతడితో పాటు అందులో నటించిన వరుణ్ సందేశ్ కొంత కాలం హీరోగా రాణించి, తర్వాత వెనకపడిపోయాడు. నిఖిల్ ఇప్పటికీ హీరోగా రాణిస్తూ, తనకంటూ ఒక ముద్రను వేసుకోగలిగాడు. ఎటొచ్చీ టైసన్ అలియాస్ రాహుల్ కెరీర్ ప్రశ్నార్థకమైపోయింది. ‘హ్యాపీడేస్’ తర్వాత వి.ఎన్. ఆదిత్య డైరెక్షన్‌లో ‘రెయిన్‌బో’ అనే సినిమాలో హీరోగా చేశాడు రాహుల్. అది ఫ్లాపవడంతో అతడిని పట్టించుకున్నవాళ్లే లేకుండా పోయారు. దాని తర్వాత మూడేళ్లకు మరోసారి ఆదిత్య డైరెక్షన్‌లో డి. రామానాయుడు నిర్మించిన ‘ముగ్గురు’ అనే ముగ్గురు హీరోల సినిమా చేశాడు. దాని తర్వాత రెండేళ్లకు ఛార్మితో కలిసి ‘ప్రేమ ఒక మైకం’ చేశాడు. ఈ రెండూ ఆడలేదు. డైరెక్టర్ మారుతి ప్రొడ్యూస్ చేసిన ‘లవ్ యూ బంగారం’ అనే సినిమాని ఎన్నో ఆశలతో చేస్తే.. అదీ ఫట్‌మంది. పైగా బూతు సినిమా అనే బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత మూడేళ్ల గ్యాప్‌తో థ్రిల్లర్లు బాగా ఆడుతున్నాయనే ఉద్దేశంతో, 2017లో ‘వెంకటాపురం’ అనే క్రైమ్ థ్రిల్లర్ చేశాడు. దాన్నీ ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు.
ఇలా ‘హ్యాపీడేస్’ తర్వాత చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతూ రావడంతో రాహుల్ కెరీర్ ఏమాత్రం ఎదగలేకపోయింది. ‘వెంకటాపురం’ వచ్చి మూడేళ్లయిపోయింది. నటుడిగా తొలి సినిమాతోటే పాపులరై కూడా తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన రాహుల్ అలియాస్ టైసన్ ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో?