కరోనా మహమ్మారి వ్యాప్తి భయంతో లాక్‌డౌన్‌కు ముందుగానే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. లాక్‌డౌన్ ముగిసినా అవి తెరుచుకోలేదు. సోషల్ డిస్టాన్సింగ్ పాటించే అవకాశాలు థియేటర్లలో తక్కువగా ఉంటుందనే అభిప్రాయంతోటే ప్రభుత్వాలు వాటికి పర్మిషన్లు ఇవ్వలేదు. దీంతో థియేటర్లు మూతపడి మూడు నెలలు దాటిపోయింది. తమ సినిమాల పనులను పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధం చేసిన నిర్మాతలు సొసైటీలో సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయా అని వేచి చూస్తున్నారు. థియేటర్లు తెరుచుకొని, జనం భయపడకుండా సినిమాలు చూడ్డానికి వచ్చే క్షణాల కోసం వాళ్లు ఎదురు చూస్తున్నారు.
అయితే ఈలోగా కొంతమంది నిర్మాతలు థియేటర్లలో తమ సినిమాల్ని రిలీజ్ చేసే ఆశల్ని వదిలేసుకొని, ఓటీటీ ప్లాట్‌ఫామ్ వైపు దృష్టి సారిస్తున్నారు. తమకు ఓటీటీ ఒక అయాచిత వరంగా వారు భావిస్తున్నారు. స్ట్రీమింగ్ సైట్ల నిర్వాహకుల నుంచి చెప్పుకోదగ్గ రేటులో ఆఫర్లు రావడమే దీనికి కారణం. అయితే ఇటీవల నేరుగా ఓటీటీలో రిలీజైన సినిమాలకు ఊహించిన రీతిలో వీక్షకాదరణ లభించకపోవడంతో ఓటీటీ రేట్ల విషయంలో వాటి నిర్వాహకులు పునరాలోచనలో పడుతున్నట్లు సమాచారం.
ఇటీవల అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన ‘గులాబో సితావో’ మూవీ స్ట్రయిట్‌గా ఓటీటీపై రిలీజైంది. విమర్శకుల ప్రశంసల్ని ఆ సినిమా పొందగలిగింది కానీ, వీక్షకాదరణ విషయంలో ఆ సినిమా బాగా వెనుకబడి పోయింది. అలాగే లేటెస్ట్‌గా కీర్తి సురేశ్ మెయిన్ రోల్ చేసిన ‘పెంగ్విన్’ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఓటీటీలో విడుదలైంది. దీనికి అటు విమర్శకుల ప్రశంసలు కానీ, ఇటు వీక్షకుల ఆదరణ కానీ రెండూ లభించలేదు.
వీటికి వ్యూయర్‌షిప్ డల్‌గా ఉండటంతో ఒక వర్గం మాత్రం ఆనందంగా ఉందని ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. ఆ వర్గం.. ఎగ్జిబిటర్స్. సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనకు వాళ్లు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఓటీటీలో నేరుగా సినిమాల్ని రిలీజ్ చేస్తే థియేటర్ల మనుగడ ఏమైపోతుందనేది వాళ్ల ప్రశ్న. ఈ రోజు కాకపోయినా, కొద్ది రోజుల తర్వాతనైనా థియేటర్లు తెరుచుకుంటాయనీ, ఆడించడానికి కొత్త సినిమాలు కరువైతే థియేటర్లను ఎలా నడపాలనీ వాళ్లు అడుగుతున్నారు. థియేటర్లపై ఆధారపడి లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారనీ, సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల వాళ్ల ఉపాధిపై దెబ్బ పడుతుందనీ వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా రానున్న రోజుల్లో థియేటర్లను కాకుండా ఓటీటీని దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీసే వాళ్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.