పూరి జగన్నాథ్ ‘దేశముదురు’ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసిన కొత్తలో దాన్ని చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో బన్నీ షర్టు లేకుండా అనాచ్ఛాదితంగా ఉన్న తన శరీర పైభాగపు కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. ఆ సినిమా విడుదలయ్యాక పాటలు, ఫైట్లు, ముద్దులొలికే హన్సికతో బన్నీ ప్రేమాయణం వంటి అంశాలు జనానికి బాగా నచ్చాక యువత టెంపరితనానికి ప్రతీకగా నిలిచిన అల్లు అర్జున్ బాడీ ఎగ్జిబిషన్ కూడా ఆరాధనా స్థాయికి వెళ్లిపోయింది.
టాలీవుడ్‌లో అంతదాకా శారీరక అవయవాల ప్రదర్శన కేవలం హీరోయిన్, వ్యాంప్ క్యారెక్టర్లకే పరిమితమవడం సంప్రదాయంగా ఉండేది. ఇలా కసరత్తు చేసి గ్రీకు విగ్రహం లాగా పెంచిన దేహాన్ని ప్రదర్శించి యువ ప్రేక్షకులు.. అందునా అమ్మాయిల మతులు పోగొట్టడమనే కొత్త ట్రెండ్‌కు బన్నీ ద్వారా పడిన నాందీ వాక్యం ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రతీ కొత్త హీరో సినీ రంగ ప్రవేశానికి ఉన్న క్వాలిఫికేషన్స్‌లో సిక్స్ ప్యాక్ బాడీని కలిగి ఉండటం కూడా ఒకటి అనే స్థాయికి ఎదిగింది.
టాలీవుడ్‌లో ఇటీవల ఈ ధోరణి మరింత విజృంభించి అరవై ఏళ్ల దాటిన వయసులో చిరంజీవి, నాగార్జున సైతం మంచి బాడీ బిల్డింగ్ చేసుకోవడానికి ప్రేరేపించడం ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం పెర్‌ఫార్మెన్స్‌నూ, మంచి టైమింగ్‌నూ, కథా కథనాలనే నమ్ముకొని టాలీవుడ్‌లోని టాప్ స్టార్లుగా అఖండ ప్రేక్షకాదరణను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత.. వీరరాఘవ’ మూవీలో సిక్స్ ప్యాక్ యాబ్స్ బాడీని బిల్డ్ చేసుకొని చూపించడం, రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ఎయిట్ ప్యాక్ యాబ్స్ బాడీతో రాంబో మాదిరిగా దర్శనమివ్వడం.. టాలీవుడ్‌లో ‘దేహముదురు’ సంస్కృతి స్థిరపడిందనడానికి తార్కాణంగా చెప్పవచ్చు.
ఇవాళ బాలకృష్ణ, నాని, శర్వానంద్ లాంటి కొద్దిమందిని మినహాయిస్తే చాలామంది తీర్చిదిద్దిన కండలతో, సిక్స్ ప్యాక్ లేదా ఎయిట్ ప్యాక్ యాబ్స్ బాడీలతో కనిపిస్తున్నారు. అంతదాకా తన టాప్‌లెస్ బాడీని సినిమాల్లో ఎప్పుడూ ప్రదర్శించని మహేశ్‌బాబు సైతం ‘శ్రీమంతుడు’ సినిమాలో షర్టు వేసుకున్న కండల వీరుడిగా దర్శనమిచ్చాడు. వెటరన్ స్టార్స్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ చక్కని బాడీ షేప్‌ను మెయిన్‌టైన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కండల వీరుడిగా కనిపించకపోయినా శరీర సౌష్ఠవాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ‘బాహుబలి’లో ఇటు ప్రభాస్, అటు రానా ఇద్దరూ తమ కండల్ని ఏ రీతిలో ప్రదర్శించారో చూశాం. రెండు బలిష్ఠమైన పొట్టేళ్లు ఢీకొన్నట్లుగా ఆ ఇద్దరూ తెరపై కలబడుతుంటే కళ్లప్పగించి చూశాం.
మహేశ్ బావ సుధీర్‌బాబు బాడీ గురించి అయితే చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లోనే మోస్ట్ టోన్డ్ బాడీ అతడిదేనని చెబుతుంటారు. నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా సిక్స్ ప్యాక్ బాడీలను రూపొందించుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ తొలిసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించాడు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ‘జయ జానకి నాయక’ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీకువీరుడి టైపులో కండలు పెంచి దర్శనమిచ్చాడు. లేటెస్ట్‌గా కిరణ్ కొర్రపాటి అనే కొత్తదర్శకుడు తీస్తున్న సినిమాలో బాక్సర్‌గా కనిపించడం కోసం వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేసుకుంటే, పూరి జగన్నాథ్ తీస్తున్న ‘లైగర్’ సినిమాలో ఫైటర్‌గా కనిపించడానికి ఇప్పటివరకూ బక్కపలచని దేహంతో కనిపిస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ కండలు పెంచాడు. వీళ్ల బాటలోనే సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రాజ్ తరుణ్, కార్తికేయ వంటి హీరోలు కూడా పయనిస్తున్నారు.