2020 వేసవి సీజన్‌ను టాలీవుడ్ ఎన్నటికీ మరచిపోలేదు. తెలుగు సినిమా చరిత్రలో ఆమాటకొస్తే ఏ భాషా సినిమా చరిత్రలోనైనా మూడు నెలలకు పైగా థియేటర్లు మూతపడి, సినిమాల విడుదలలు నిలిచిపోయిన మొట్టమొదటి సందర్భం ఇదే. కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిలోని అతి పెద్ద సీజన్, అత్యధిక సంఖ్యలో సినిమాలు విడుదలయ్యే సీజన్, అత్యధిక శాతం కలెక్షన్లు వచ్చే సీజన్.. సమ్మర్ సీజన్. అలాంటి సీజన్‌లో ఒక్కటంటే ఒక్కటి కూడా థియేటర్లలో కొత్త సినిమాని చూసే ఛాన్స్ మిస్సయిపోయాం. వేసవి తర్వాత వచ్చే మరో పెద్ద సీజన్.. దసరా సీజన్. దసరా వస్తున్నదంటే తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాతలు తహతహ లాడుతుంటారు. అయితే వచ్చే దసరా సీజన్‌కు సినిమాలు రిలీజవుతాయా, లేదా.. అనేది ఎవరూ చెప్పలేని స్థితిలో ఉన్నాం.
ఈ ఏడాది అక్టోబర్ 25న విజయదశమి పర్వదినం. దానికి వారం రోజుల ముందుగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం పరిపాటి. కానీ ఈ ఏడాది వేసవి ముగిసిపోయినా స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీదు. ఒకవేళ సెప్టెంబర్‌లో అవి తెరుచుకుంటే, దసరా సెలవులు అనేవి ఈసారి ఉండవు. ఇప్పటికే నెలల తరబడి స్టూడెంట్స్ ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి, పండగ సెలవులు ఉండవు. అయినప్పటికీ ఆ టైమ్‌కు థియేటర్లు తెరుచుకుంటే.. సినిమాలు చూసేందుకు జనం రెడీ అవుతారా?.. అనే సందేహం ఫిల్మ్ మేకర్స్‌ను పట్టి పీడిస్తోంది. థియేటర్లు తెరుచుకోవాలంటే కొత్త సినిమాలు రిలీజవ్వాలి. దసరా సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా సినిమాల్ని రెడీ చేస్తున్నారా?
పరిస్థితులు బాగుంటే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబో మూవీ ‘ఆచార్య’ దసరా సీజన్‌ను టార్గెట్ చేసుకొని వచ్చేదే. ఇప్పుడు అది ఊహాతీతం. ఆ సినిమా 2021 సంక్రాంతికి కూడా వచ్చే అవకాశం లేదనీ, వేసవికి రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయనీ అంటున్నారు. మెగాస్టార్ బరిలో లేకపోయినా పవర్‌స్టార్ అయినా దసరాకు రావడానికి ఛాన్సులున్నాయి. ఆయన టైటిల్ రోల్ చేస్తోన్న ‘వకీల్ సాబ్’ మూవీ నిజానికి మే 15న రిలీజ్ కావాల్సి ఉంది. జూలై లేదా ఆగస్ట్‌లో బ్యాలెన్స్ ఉన్న పోర్షన్‌ను షూట్ చేస్తే, దసరాకు ఆ సినిమాని రిలీజ్ చేయవచ్చు. ఫ్యాన్స్ కూడా ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి నిర్మాత దిల్ రాజు ఏం ఆలోచిస్తున్నాడో చూడాలి. ఆ టైమ్‌కు థియేటర్లు తెరుచుకుంటే, కరోనా వైరస్ భయాన్ని జయించి జనాన్ని థియేటర్లకు రప్పించగల సత్తా ‘వకీల్ సాబ్’కు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
‘వకీల్ సాబ్’ మినహా దసరా సీజన్‌కు విడుదల చేయగల ఆ స్థాయి సినిమా మరొకటి ఏదీ ప్రస్తుతానికి లేదు. ప్రభాస్ - పూజా హెగ్డే కాంబో మూవీ కానీ, అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కానీ 2021లో వచ్చేవే. కాకపోతే క్రేజ్ ఉన్న కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు రావచ్చు. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ‘లవ్ స్టోరి’, రానా, సాయిపల్లవి జోడీగా వేణు ఊడుగుల రూపొందిస్తోన్న ‘విరాటపర్వం’, నాని విలన్‌గా నటించిన ‘వి’ వంటి సినిమాలు ఆ సీజన్‌లో వచ్చే అవకాశాలున్నాయి. ఎటొచ్చీ.. అసలు ఆ టైమ్‌కైనా థియేటర్లు ఓపెన్ అవుతాయా? అయినా రిస్క్ తీసుకొని జనం థియేటర్లకు వస్తారా? అనే సందేహాలు మాత్రం పీడిస్తున్నాయి. కొంతమందైతే సమ్మర్ సీజన్‌ను దసరా సీజన్ అనుసరిస్తుందనీ, దసరా కూడా సినిమాలు లేకుండానే గడిచిపోతుందనీ భావిస్తున్నారు. అదే నిజమైతే.. టాలీవుడ్‌కు జరిగిన, జరుగుతున్న నష్టాన్ని ఇప్పట్లో పూడ్చడం చాలా చాలా కష్టం.