కరోనా మహమ్మారి దెబ్బకు మూడు నెలల నుంచి టాలీవుడ్ స్తబ్దుగా మారిపోయింది. లాక్‌డౌన్ ఎత్తివేశాక అనేక రంగాల్లో కార్యకలాపాలు పునఃప్రారంభమైనా, టాలీవుడ్‌లో షూటింగ్‌లు మాత్రం మొదలవలేదు. రవిబాబు లాంటి ఒకరిద్దరు దర్శక నిర్మాతలు మాత్రమే తమ సినిమాల షూటింగ్స్‌ను రెజ్యూమ్ చేశారు. భారీ, మధ్య స్థాయి బడ్జెట్ సినిమాలేవీ సెట్స్ మీదకు వెళ్లలేదు. కరోనా తగ్గినా, తగ్గకపోయినా ఆగస్టులో షూటింగ్స్‌ను మొదలుపెట్టడానికి ఆ సినిమాల నిర్మాతలు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. వాటి సంగతి ఎలా ఉన్నా చిన్న సినిమాల పరిస్థితే అగమ్యగోచరంగా మారిపోయిందంటున్నారు.
కరోనా కేసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో ఉధృతంగా పెరుగుతుండటంతో ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకుంటాయనే ఆశ కనిపించడం లేదు. ఒకవేళ తెరుచుకున్నా చిన్న సినిమాలు విడుదలయ్యే అవకాశాలు అసలు కనిపించడం లేదు. కారణం.. ప్రేక్షకులు ఇదివరకటిలా థియేటర్లకు రారనే ఆలోచన. క్రేజీ సినిమాలకే కలెక్షన్లు ఎలా వస్తాయో అర్థంకాని స్థితి ఉందనీ, ఇక చిన్న సినిమాలు చూడ్డానికి ఎవరు రిస్క్ తీసుకొని థియేటర్లకు వస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. దాంతో థియేటర్ల రెంట్లు కట్టడానికి కూడా వచ్చే కలెక్షన్లు సరిపోవనీ, లీజ్ హోల్డర్లకు ఎదురు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందనీ చాలామంది భయపడుతున్నారు.
అందువల్ల చిన్న సినిమాలకు థియేటర్లు కాకుండా ఓటీటీయే దిక్కనే మాట బలంగా వినిపిస్తోంది. కీర్తి సురేష్ లాంటి క్రేజీ హీరోయిన్ నటించిన ‘పెంగ్విన్’ సినిమాయే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవడంతో చిన్న సినిమాల నిర్మాతలు ఇప్పుడు థియేటర్ రిలీజ్ ఆశలు వదిలేసుకొని, ఓటీటీ ప్లాట్‌ఫామ్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఆ మధ్య ‘అమృతారామమ్’ అనే సినిమా థియేటర్ల మీద ఆశ పెట్టుకోకుండా ఓటీటీలో రిలీజైంది. దానివల్ల ఆ చిత్ర నిర్మాతకు బాగానే గిట్టుబాటయ్యిందంటున్నారు. మూడు నాలుగేళ్ల క్రితం షూటింగ్ జరుపుకొని ఫైనాన్స్ ప్రాబ్లమ్ కారణంగా రిలీజ్‌కు నోచుకోకుండా ఉండిపోయిన గోపీచంద్, నయనతార కాంబినేషన్ ఫిల్మ్ ‘ఆరడుగుల బుల్లెట్’ను దాని నిర్మాత ఓటీటీలో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బి. గోపాల్ లాంటి పేరుపొందిన వెటరన్ డైరెక్టర్ తీసిన ఈ సినిమాని ఆడియెన్స్ చూసే రోజు వస్తుందని టాలీవుడ్‌లో ఎవరూ ఊహించలేదు. ఓటీటీ పుణ్యమా అని దాన్ని చూసే అవకాశం త్వరలో రావచ్చు.
ఈ నేపథ్యంలో చిన్న సినిమాలకు ఓటీటీ ఆదాయ వనరుగా కనిపిస్తోంది. థియేటర్లను నమ్ముకొని అదనంగా నష్టపోయేకంటే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, హాట్‌స్టార్ తదితర స్ట్రీమింగ్ సైట్లకు తమ సినిమాలను నేరుగా అమ్ముకోవడం బెటర్ అని నిర్మాతలు భావిస్తున్నారు. చూస్తుంటే రానున్న రోజుల్లో ఓటీటీ దెబ్బకు థియేటర్లకే ఫీడింగ్ సరిగా ఉండని పరిస్థితి దాపురించే ప్రమాదం ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు కూడా.