అల్లు అర్జున్ - సుకుమార్‌లు ‘పుష్ప’ సినిమా ప్లానింగ్‌తో పాన్ ఇండియాకి దిగుదామని ఎదురు చూస్తుంటే కరోనా కాలం వాళ్ళని ముందుకు వెళ్లనీయడం లేదు. అసలే రంగస్థలం తర్వాత వచ్చిన గ్యాప్ ని పుష్ప తో ఫుల్ ఫీల్ చేయాలని సుకుమార్ చూస్తుంటే కరోనా అడ్డు పడింది. లాక్‌డౌన్ ముగిసి షూటింగ్ కి వెళ్దాం అంటే ప్రభుత్వం ఇచ్చిన కండిషన్స్ తో షూటింగ్ చెయ్యడం సాధ్యమయ్యేపనిలా లేదు. అందుకే ఆగష్టు నుండి షూటింగ్స్ మొదలెట్టే ఆలోచనలతో అందరూ ఉన్నారు. తాజాగా సుకుమార్ - అల్లు అర్జున్ పుష్ప టీం కూడా ఆగష్టు నుండే సెట్స్ మీదకెళ్లేలా ఉన్నారు. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితి వలన సినిమా షూటింగ్స్ వేరే రాష్ట్రాలకు వెళ్లి చేసే ఛాన్స్ లేదు. అందుకే పుష్ప టీం అడవిలో చేయాల్సిన షూటింగ్ ని కాస్తా హైదరాబాద్ లోనే ఓ సెట్ వేసి చిత్రీకరిస్తారనే ప్రచారం జరుగుతుంది.
అయితే తాజాగా పుష్ప టీం లైన్ లోకొచ్చి అడవి సెట్టు లేదు ఏమి లేదు.. ఈ సినిమా షూటింగ్ ఖచ్చితంగా ఫారెస్ట్ లోనే జరుగుతుంది. సెట్టింగులు వేసే అవకాశం, అవసరం ఈ కథకు లేదని తేల్చేశారు. ముందు అనుకున్నట్టుగానే పుష్ప సినిమా షూటింగ్ సహజమైన లొకేషన్లలోనే అంటే మారేడుమిల్లి అడవుల్లోనే జరగబోతుంది. అయితే దట్టమైన అటవీ ప్రాంతాల్లో షూట్ చేసుకునేందుకు వీలుగా అడవిలో ఉన్న డొంకలను కాస్తా రోడ్లగా బాగుచేస్తున్నారట. సినిమాలో కీలకమైన ఛేజింగులు చేయడానికి అనువుగా.. పుష్ప టీం స్వయంగా రోడ్లు వేస్తున్నారట. అడవిలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరగబోతోందని తెలుస్తోంది. మరి అవన్నీ పూర్తయ్యాకే పుష్ప టీం నేరుగా సెట్స్ మీదకెళ్ళిపోతుందట.