ఒకే ఏడాది పరిచయమై టాప్ డైరెక్టర్లుగా ఎదిగిన ఆ ముగ్గురు...
పదిహేనేళ్ల క్రితం ముగ్గురు దర్శకులు తమ తొలి చిత్రాలతో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొని, సూపర్ హిట్లు సాధించి, ఇప్పటికీ తమదైన ముద్రను వేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఆ ముగ్గురు దర్శకులు.. ప్రభుదేవా, సురేందర్‌రెడ్డి, బోయపాటి శ్రీను. ఈ ముగ్గురూ 2005లోనే దర్శకులుగా పరిచయమయ్యారు.
కొరియోగ్రాఫర్‌గా, యాక్టర్‌గా అప్పటికే ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించిన ప్రభుదేవా మొదటగా ఆ ఏడాది ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో డైరెక్టర్‌గా మన ముందుకు వచ్చాడు. అదే సినిమాతో సిద్ధార్థ్ కూడా హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. సిద్ధార్థ్, త్రిష మధ్య నడిచిన అందమైన ప్రేమకథ, ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, త్రిష అన్నగా శ్రీహరి క్యారెక్టరైజేషన్, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కలిపి ఆ సినిమాను సూపర్ హిట్ చేశాయి. మొత్తానికి ఇటు ప్రభుదేవాను, అటు సిద్ధార్థ్‌ను ఇద్దరినీ టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత ఆ సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజుదే. ఆ తర్వాత కాలంలో ప్రభుదేవా బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి తన సత్తాను చాటుతూ వస్తున్న విషయం తెలిసిందే.
మే 7న వచ్చిన ‘అతనొక్కడే’ సినిమాపై మొదట్లో ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేవు. అదివరకు కల్యాణ్‌రామ్ హీరోగా తన ముద్రను వేయలేకపోవడం, ఎవరో కొత్త దర్శకుడు ఆ సినిమాని తీశాడనుకోవడంతో జనం ఆ సినిమా గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ అది విడుదలవడం, మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు ఫస్ట్ సీన్‌లోనే హీరోయిన్ ఒకడిని కత్తితో పొడిచి చంపడంతో ఒక్కసారిగా షాక్ తిని, కుర్చీలపై మునివేళ్లతో కూర్చోవడం జరిగిపోయాయి. ‘అతనొక్కడే’ సినిమా ప్రేక్షకులకు నిజంగా ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. కల్యాణ్‌రామ్‌కు తొలి హిట్ లభించింది. డైరెక్టర్‌గా సురేందర్‌రెడ్డిని రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. ఆ తర్వాత మధ్యలో చిన్న ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, టాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్స్‌లో ఒకడిగా అతను ఇప్పటికీ రాణిస్తున్నాడు.
ఇక మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సినిమా ‘భద్ర’. 12వ తేదీ విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ అంచనాలను అందుకుంటూ ఘన విజయం సాధించింది. దిల్ రాజు నిర్మాత కావడం, హీరోగా రవితేజ నటించడంతో కచ్చితంగా ఈ సినిమాలో విషయం ఉంటుందని జనం ఊహించారు. డైరెక్టర్‌గా పరిచయమైన బోయపాటి శ్రీను తొలి సినిమాతోటే తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకుల మనసుల్ని గెలిచాడు. మాస్ పల్స్ పట్టుకున్న దర్శకుడిగా అంతకంతకూ భారీ విజయాలు సాధించుకుంటూ టాప్ డైరెక్టర్‌గా ఎదిగాడు. డైరెక్ట్ చేసిన ఎనిమిది సినిమాల్లో కేవలం రెండు సినిమాలే ఫ్లాపవడం, ఆరు సినిమాలు సూపర్ హిట్టవడం అతని సామర్థ్యం ఎలాంటిదనేందుకు నిదర్శనం. ఇప్పుడతను ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత మరోసారి బాలయ్యను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ ముగ్గురితో పాటు అదే ఏడాది ‘వెన్నెల’ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమై ఆకట్టుకున్నాడు దేవా కట్టా. అయితే ఆ తర్వాత కాలంలో ‘ప్రస్థానం’ మినహా ఆశించిన రీతిలో సినిమాలు తీయలేకపోయాడు. అలాగే ‘ఒక ఊరిలో..’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన రమేశ్‌వర్మ ‘రైడ్’తో తొలి హిట్, ఇటీవలే ‘రాక్షసుడు’తో మలి హిట్ సాధించి, రవితేజను డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.