సుశాంత్ రాజ్ పుత ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. నెపోటిజంపై చాలా మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ , సల్మాన్ ఖాన్ లపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంధుప్రీతి వల్ల ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ జియాఖాన్ తల్లి సల్మాన్ ఖాన్ పై అనేక ఆరోపణలు చేసింది. ఆమె మాట్లాడుతూ, జియా ఖాన్ ఆత్మహత్యా కేసుని సల్మాన్ ఖాన్ తన పలుకుబడిని ఉపయోగించి పక్కదారి పట్టించారని, అసలు విచారణ జరగకుండా లాబీయింగ్ చేశారని ఆరోపిస్తుంది.
ఆమె మరణానికి కారణమైన ప్రధాన వ్యక్తిని తప్పించి, అతన్ని బయటకి తెచ్చాడని.. ఇదంతా ఆయనకున్న పాపులారిటీని ఉపయోగించి చేసాడని అంటుంది. జియా ఖాన్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం సినిమా ద్వారా బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత గజిని, హౌస్ ఫుల్ వంటి సినిమాల్లో కనిపించింది. 2013లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.