బాలయ్య నమ్ముకొన్న ఫార్ములా.. రెండు క్యారెక్టర్లు.. ఒక ఫ్లాష్‌బ్లాక్!
‘బాషా’.. బాలకృష్ణకు బాగా నచ్చిన సినిమా. అందులో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో రజనీకాంత్ చూపిన నట విశ్వరూపం, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో అదరగొట్టిన తీరు ఆయనకు యమ నచ్చేశాయి. అందుకే ఆ తరహా క్యారెక్టరైజేషన్స్‌తో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత అదే తరహా క్యారెక్టర్లు జనానికి విసుగు తెప్పిస్తుండటంతో, పంథాని కాస్తంత మార్చాడు. ఒకే క్యారెక్టర్, రెండు క్యారెక్టరైజేషన్లు కాకుండా రెండు క్యారెక్టర్లు, రెండు క్యారెక్టరైజేషన్స్‌ను అడాప్ట్ చేసుకుంటూ వచ్చాడు. దానికి బోయపాటి శ్రీను రూపంలో కరెక్ట్ డైరెక్టర్ లభించాడు. అలా ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు వచ్చాయి. ‘సింహా’ మూవీలో తండ్రీ కొడుకులుగా, ‘లెజెండ్’లో అన్నదమ్ములుగా బాలయ్య కనిపించి, అభిమానుల్ని అలరించాడు.
‘సింహా’ మూవీలో మొదట కొడుకు క్యారెక్టర్ అయిన యూనివర్సిటీ లెక్చరర్ లక్ష్మీనారాయణగా తన నాయనమ్మ (కె.ఆర్. విజయ)తో కలిసి జీవిస్తూ, తన స్టూడెంట్ అయిన స్నేహా ఉల్లాల్‌తో ప్రేమలో పడి, తోటి లెక్చరర్ నమితను ఆకర్షించి, ఆ ఇద్దరితోనూ ఆడుతూ పాడుతూ కనిపిస్తాడు బాలయ్య. తన ముందు ఏదైనా అన్యాయం జరిగితే, దానికి కారణమైన వాళ్లను చితగ్గొట్టే మొనగాడు కూడా. ఆ తర్వాత లక్ష్మీనారాయణ తండ్రి డాక్టర్ నరసింహగా ఫ్లాష్‌బ్యాక్‌లో మరింత పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ పరిచయమే రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్‌తో పాటు భార్య నయనతారతో అనుబంధం కూడా సినిమా ఘనవిజయానికి కారణమయ్యాయి. అలా రెండు క్యారెక్టర్లు, రెండు క్యారెక్టరైజేషన్లతో ‘సింహా’ బాలకృష్ణ కెరీర్‌ను కాపాడింది.
ఇక ‘లెజెండ్’ మూవీలోనూ కొద్దిపాటి మార్పుతో బాలయ్య కోసం రెండు క్యారెక్టర్లు, రెండు క్యారెక్టరైజేషన్లను సృష్టించాడు బోయపాటి. ఈ సినిమాలోనూ మనకు మొదట ఎన్నారై కృష్ణ పాత్రతో ప్రేక్షకులకు పరిచయమవుతాడు బాలయ్య. దుబాయ్ నుంచి ప్రేయసి సోనాల్ చౌహాన్‌తో ఇండియాకు తిరిగొచ్చిన అతను విలన్ జితేంద్ర (జగపతిబాబు) కొడుకును చితగ్గొడతాడు. దాంతో కృష్ణను జితేంద్ర చంపబోతుంటే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అప్పుడు ప్రత్యక్షమవుతాడు లెజెండ్ అయిన జయదేవ్ క్యారెక్టర్‌లో బాలకృష్ణ. ఆ తర్వాత ఆ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ వచ్చి ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. అలా జయదేవ్ క్యారెక్టర్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేయడమే కాకుండా, టాలీవుడ్‌లోనే అత్యధిక రోజులు ఆడిన సినిమాగా చరిత్ర సృష్టించడానికి కారణమైంది.
కట్ చేస్తే.. ఇప్పుడు ‘బీబీ3’లోనూ ఇదే తరహా రెండు క్యారెక్టర్లలో బాలయ్యను బోయపాటి చూపిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే వచ్చిన టీజర్ ద్వారా మిడిల్ ఏజ్‌లో ఉన్న ఒక బాలయ్యను మనకు చూపించేశాడు బోయపాటి. ఈ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో బాలయ్య చెప్పిన డైలాగ్ తెలియజేస్తోంది. ఇది కాకుండా బాలకృష్ణ ఇంకో క్యారెక్టర్ కూడా చేస్తున్నాడనీ, అది అఘోరా పాత్ర అనీ ఇప్పటికే జోరుగా ప్రచారం నడుస్తోంది. ఆ అఘోరా క్యారెక్టర్ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందనీ, కథకు అది చాలా క్రూషియల్ అనీ తెలుస్తోంది. మరోసారి రెండు క్యారెక్టర్లు, రెండు క్యారెక్టరైజేషన్లు, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఫార్మట్‌ని నమ్ముకొని ఇటు బాలయ్య, అటు బోయపాటి ఈ సినిమా చేస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తరహాలోనే ‘బీబీ3’ కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకం వారిలో కనిపిస్తోంది. ఈ సినిమాతో వాళ్ల కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందో, లేదో.. చూడాల్సిందే.