ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్స్, హీరోలంతా పాన్ ఇండియా మీదే కన్నేశారు. ఒక్కో స్టార్ హీరో పాన్ ఇండియా మూవీ మొదలు పెడుతూ క్రేజ్ ని పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. బాహుబలితో ప్రభాస్ అందుకున్న రేంజ్ కోసం ప్రతి స్టార్ హీరో తహతహలాడుతున్నారు. రాజమౌళి ఎన్టీఆర్ - రామ్ చరణ్ ని అందలం ఎక్కిస్తుంటే.. ప్రభాస్ సాహో తో ఎక్కుదామనుకుని బోర్లా పడ్డాడు. మళ్ళీ పాన్ ఇండియా మూవీనే చేస్తున్నాడు. మరోపక్క అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప అంటున్నాడు. ఇక విజయ్ దేవరకొండ - పూరి కూడా పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఎవరిష్టం వాళ్లది. కథ పాన్ ఇండియా లెవల్ కి సరిపోతే చేయచ్చు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిమ్స్ మొదలు పెట్టి దర్శకులు ఘోల్లుమంటున్నారు. పాన్ ఇండియా మూవీ అంటే అన్ని భాషల నటులు ఉండాలి. అందుకే పెద్ద మొత్తంలో బాలీవుడ్ నుండి తమ సినిమాల కోసం క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌ని, నటులను దింపుతున్నారు.
కానీ కరోనా ఇప్పుడు అందరి ప్లాన్స్ పాడు చేసింది. కరోనా మహమ్మారి వలన షూటింగ్స్ రెండు నెలలు వాయిదా పడితే పడ్డాయి. మళ్లీ ప్రభుత్వ అనుమతులతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ షూటింగ్స్ మొదలు పెడితే.. ఇప్పుడు ముంబై నటులు తాము ఇంకా షూటింగ్స్ కోసం అప్పుడే రాలేమని చెప్పేస్తున్నారట. కరోనా ఉదృతి కొనసాగుతున్న టైం లో రిస్క్ చేయలేము.. అంటూ దర్శకులకు చెబుతున్నారట. మరి పాన్ ఇండియా క్రేజ్ కోసం బాలీవుడ్ ఇతర భాషల నటులను తీసుకుని.. ఇప్పుడు వాళ్ళెప్పుడు వస్తారో అని ఎదురు చూడాల్సి వస్తుంది.
ఎలాగోలా సినిమా షూటింగ్స్ పూర్తి చేసి సినిమాలను ఓ కొలిక్కి తెద్దామని దర్శకనిర్మాతలు చూస్తుంటే ఇప్పుడు ఇతర భాషల నటులు ఇలా హ్యాండ్ ఇస్తున్నారు. అదే పాన్ ఇండియా మూవీస్ కాకుండా అయితే ఇక్కడ టాలీవుడ్ నటులతో సినిమాల షూటింగ్ మొదలైపోయేది. అలా పాన్ ఇండియా అని దర్శకనిర్మాతలు అడ్డంగా ఇరుక్కున్నారు.