కరోనా రక్కసి కరాళ నృత్యాన్ని చూసి ప్రపంచ పటమే భయంతో వణికిపోతున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యం చేసే లక్ష్యంతో రూపొందిన ‘కరోనా రక్కసి’ అనే పాటల ఆల్బమ్‌ను ప్రముఖ సినీ దర్శకులు వి.వి.వినాయక్ ఈనెల 16 వ తేదీన ఆవిష్కరించారు. అభ్యుదయ సినీ దర్శకుడు ‘బాబ్జీ’ రచించిన ఈ పాటలను ప్రజా నాట్యమండలి గాయకుడు ‘లక్ష్మణ్ పూడి’ ఆలపించారు. యువ సంగీత దర్శకుడు ప్రేమ్ స్వరాలను అందించారు.
ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. కరోనా రక్కసి విభృంజనను చూసి జనమంతా విపరీతంగా భయపడి పోతున్నారని, కానీ మనం చేయవలసినది భయపడడం కాదు, జాగ్రత్తలు తీసుకోవడం అని, యీ విపత్తు సమయంలో ఆర్ధికంగా బలంగా వున్న వ్యక్తులందరూ ఆర్ధికంగా బలహీనంగా వున్న పేద సాదలకు అండగా నిలబడి మానవత్వాన్ని చాటాలని పేర్కొంటూ, ప్రజలను చైతన్య పరిచేందుకై ఈ పాటల ఆల్బమ్‌ను రూపొందిన బాబ్జీ , లక్ష్మణ్ పూడిగార్లను అభినందించారు.
దర్శక రచయిత బాబ్జీ మాట్లాడుతూ.. సమాజంలో ఏ విపత్తు వచ్చినా స్పందించడం, ప్రజల పక్షాన నిలబడడం కళాకారుల బాధ్యత అని, ఆ బాధ్యతతోనే ఈ పాటలను రూపొందించాము..’’ అని అన్నారు.
ప్రజా నాట్యమండలి గాయకుడు, ఈ పాటల ఆల్బమ్ రూపకర్త లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ.. ‘‘లాక్ డౌన్ ఎత్తి వేసిన తరువాత ప్రజలలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందని, ఎవరికి వాళ్ళు మాకు ఏమి కాదు అనే భావనతో బయట తిరుగుతున్నారని, అలాంటి జనాన్ని చైతన్యపరచడానికే ఈ పాటలను రూపొందించాము..’’ అని తెలిపారు.