2018లో వచ్చిన ‘గీత గోవిందం’ మూవీ సంచలన తార రష్మికా మందన్న కెరీర్ విషయంలో గేమ్ చేంజర్‌గా నిలిచిందనేది వాస్తవం. ఆ మూవీ సాధించిన అమోఘమైన విజయంతో రష్మిక టాలీవుడ్‌లో రైజింగ్ స్టార్‌గా మారింది. విజయ్ దేవరకొండతో ఆమెకు అది తొలి చిత్రం. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కీలక పాత్ర వహించింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఆ మూవీకి ఇటు ప్రేక్షకుల ఆశీర్వాదాలు, అటు విమర్శకుల ప్రశంసలూ లభించాయి. అన్ని అంచనాలనూ అధిగమించిన ఆ సినిమా అనూహ్యమైన వసూళ్లను సాధించింది. అయితే చాలా మందికి తెలీని విషయం.. విజయ్ దేవరకొండతో కలిసి నటించడానికి మొదట రష్మిక చాలా భయపడిందనేది.
ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో రష్మిక స్వయంగా వెల్లడించింది. కొత్తవాళ్లతో కలిసి పనిచేసేటప్పుడు తను నెర్వస్‌గా ఫీలవుతాననీ, విజయ్ విషయంలోనూ అలాగే జరిగిందనీ ఆమె తెలిపింది. అతనితో మాట్లాడిన తర్వాతే కలిసి పనిచేసే విషయంలో అతనెంత కూల్ పర్సనో ఆమెకు అర్థమైందట. ‘కొత్తవాళ్లంటే నాకు భయం. విజయ్‌తో ఫస్ట్ షాట్ చేసేటప్పుడు అలాగే భయపడ్డాను. కానీ తర్వాత విజయ్ చాలా సరదాగా ఉండే మనిషనీ, అతనితో కలిసి పనిచేయడం చాలా ఈజీ అని అర్థమైంది’ అని చెప్పింది రష్మిక.
‘గీత గోవిందం’ తర్వాత ఆ ఇద్దరూ కలిసి ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేశారు. విపరీతమైన అంచనాల మధ్య రిలీజైన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ రూపొందించిన ఆ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన రాగా, ఏ యూత్‌ను టార్గెట్ చేసుకొని ఆ సినిమా తీశారో ఆ యూత్ దానిని ఆశించిన రీతిలో ఆదరించలేదు. అదే టైమ్‌లో వచ్చిన పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ముందు ఆ మూవీ తేలిపోయింది.
అయితే రష్మిక ఎక్కువ కాలం ఆ బాధను అనుభవించాల్సిన అవసరం లేకపోయింది. సూపర్‌స్టార్ మహేశ్‌తో తొలిసారి కలిసి చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్‌బస్టర్ కాగా, నితిన్‌తో నటించిన ‘భీష్మ’ కూడా మంచి విజయం సాధించి ఆమెకు ఆనందాన్ని కలిగించాయి. ఇప్పుడామె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ మూవీ చేస్తోంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పర్ఫార్మెన్స్‌కు అవకాశం ఉన్న క్యారెక్టర్ చేస్తోంది. సుక్కు సినిమాల్లో హీరోయిన్‌కు ప్రాధాన్యం తప్పకుండా ఉంటుందని ‘ఆర్య’ నుంచి ‘రంగస్థలం’ దాకా మనం చూశాం. ‘పుష్ప’ కాకుండా కార్తీతో తమిళ చిత్రం ‘సుల్తాన్’, ధ్రువ్ సర్జాతో కన్నడ చిత్రం ‘పొగరు’ చేస్తోంది రష్మిక.