ఇటీవల కెరీర్‌లో కొంత వెనుకంజ వేసిన పూరి జగన్నాథ్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ తన సత్తా ఏపాటిదో చూపాడు. హీరో డాషింగ్ క్యారెక్టరైజేషన్, సూపర్ స్పీడ్ స్క్రీన్‌ప్లేతో మునుపటి పూరిని గుర్తుకు తెచ్చాడు. అదే జోరు, అదే ఊపుతో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ ఏక కాలంలో ఈ సినిమాని పిక్చరైజ్ చేస్తున్నాడు పూరి. ఈ సినిమా కోసం ‘లైగర్’ అనే టైటిల్‌ను తెలుగు, హిందీ భాషలు రెండింటిలోనూ రిజిస్టర్ చేయించినప్పటికీ అధికారికంగా అనౌన్స్ చేయలేదు. హిందీలో ఈ మూవీకి కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. కాగా కరణ్‌తో పూరి కనెక్షన్ ఈ ఒక్క సినిమాకే పరిమితం కాదనీ, మరో రెండు సినిమాలకు ఇద్దరి మధ్యా డీల్ కుదిరిందనీ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఆ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజిలో ఉంటాయా, లేక కేవలం హిందీలోనే ఉంటాయా అనే విషయం వెల్లడి కావాల్సి ఉంది.
బాలీవుడ్‌తో పూరి కనెక్షన్ ఇప్పటిది కాదు. పదహారేళ్ల కిందటే ‘షర్త్: ద ఛాలెంజ్’ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు పూరి. అది.. పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘బద్రి’కి రీమేక్. జితేంద్ర కొడుకు తుషార్ కపూర్ హీరోగా నటించిన ఆ రీమేక్ తెలుగు ఒరిజినల్ తరహాలో ఆడలేదు. ఆ మూవీ తర్వాత మరో హిందీ మూవీని కూడా పూరి తీశాడు. ఈసారి ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను డైరెక్ట్ చేశాడు. ఆ మూవీ.. 2011లో వచ్చిన ‘బుడ్డా.. హోగా తేరా బాప్’. తక్కువ బడ్జెట్‌తోటే దాన్ని తీసి సూపర్ హిట్ కొట్టాడు పూరి. అంతేకాదు.. తన డైరెక్షన్ స్కిల్స్‌తో బిగ్ బి ప్రశంసలు అందుకున్నాడు.
ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు జగన్. ఇవాళ కొంతమంది దర్శకులు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా తమ పరిధిని పెంచుకోవాలనీ, పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకోవాలనీ ఆశిస్తున్నారు. అందుకే బాలీవుడ్ వైపు చూపు సారిస్తున్నారు. అదే కోవలో పూరి జగన్నాథ్ సైతం బాలీవుడ్‌పై కన్నేశాడంటున్నారు. అతడి ప్రతిభ గురించి బాగా తెలిసిన కరణ్ జోహార్ కూడా అందుకు ఊతమిచ్చాడని తెలుస్తోంది. సినిమాని ఎలా బిజినెస్ చేసుకోవాలో బాగా తెలిసిన కరణ్.. మరో రెండు సినిమాలను కూడా పూరి డైరెక్షన్‌లో చేయడానికి ఒప్పందం చేసుకున్నాడనీ, వాటి కోసం ఇప్పటికే రెండు స్క్రిప్టులను రెడీగా ఉంచాడనీ సమాచారం. నిజానికి ఇప్పటికే పూరి దగ్గర పాతిక వరకు స్క్రిప్టులు ఉన్నాయని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. వాటిలోనే రెండు కథలను కరణ్‌కు అతను చెప్పినట్లు, వాటిని కరణ్ ఓకే చేసినట్లు చెప్పుకుంటున్నారు.