లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో జనాలందరూ వినోదం కోసం ఓటీటీ వేదికలపై పడ్డారు. సినిమా, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా ఏది పడితే అది, ఏ భాషలోనైనా చూస్తూ వచ్చారు. ఇదే అదునుగా చేసుకుని ఓటీటీ యాజమాన్యాలు కొత్త కొత్త వెబ్ సిరీస్ లతో పాటుగా కొత్త సినిమాలని జనాల ముందుకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలకి పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇస్తున్నారు.
సినిమాని బట్టి ఆ ఆఫర్ భారీగానే ఉంటుంది. థియేటర్లు ఓపెన్ అయ్యే వరకి సినిమాలని తమ దగ్గరే ఉంచుకుని లాభం లేదనుకునే నిర్మాతలు ఓటీటీలో రిలీజ్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఇప్పటి వరకూ చాలా తక్కువ చిత్రాలు మాత్రమే ఓటీటీ ద్వారా విడుదల అయ్యాయి. చిన్న చిత్రాలని ఓటీటీలో రిలీజ్ చేయడం సాధ్యమే కానీ, భారీ బడ్జెట్ లో తెరకెక్కించిన చిత్రాలని ఓటీటీలో రిలీజ్ చేయడం అంత లాభసాటి కాదని ఆగిపోతున్నారు.
అయితే ప్రేక్షకుఅల్ని ఎంగేజ్ చేయడానికి ఓటీటీ యాజమాన్యాలకి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ కావాలి. అందుకని థియేటర్లో రిలీజ్ చేద్దామని అనేక కారణాల వల్ల ల్యాబ్ లలో నిలిచిపోయిన చిత్రాలని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. యాక్టర్ సత్యదేవ్ నటించిన 47 డేస్ చిత్రాన్ని ఎప్పుడో కంప్లీట్ చేశారు. కానీ అనేక కారణాల వల్ల అది రిలీజ్ కి నోచుకోలేదు. అలాగే అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు పరిస్థితి కూడా అలాంటిదే. ఈ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే మరికొన్ని ల్యాబ్ లలో మగ్గిపోయిన సినిమాలని బయటకి తీసే అవకాశం ఉంది.